ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

క్యాష్‌ ఇస్తేనే ఇసుక లోడింగ్‌.. డిజిటల్ పేమెంట్ల కాలంలో ఇదేం ఫిటింగ్?

రోడ్డు పక్కన టీ, టిఫిన్‌ బండ్లలోనూ గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం లాంటి డిజిటల్‌ చెల్లింపులు తీసుకుంటున్న రోజులివి. అలాంటిది వేలు ఖర్చు చేసి తీసుకునే ఇసుకకు నగదు మాత్రమే ఇవ్వాలని గుత్తేదారు సంస్థ పట్టుబడుతున్న తీరుపై కొనుగోలుదారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Sand Loadind
ఇసుక లోడింగ్‌

By

Published : Jul 13, 2021, 8:49 AM IST

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల టెండరును జేపీ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ సంస్థ దక్కించుకొని, మే 14 నుంచి బాధ్యతలు చేపట్టింది. టన్ను రూ.475 చొప్పున విక్రయిస్తోంది. లోడింగ్‌ కోసం వచ్చేవారు నగదు మాత్రమే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 20 టన్నుల ఇసుక కావాలంటే రూ.9,500 చెల్లించాలి. ఇలా ప్రతి ట్రిప్‌లో నగదు తీసుకెళ్లడం సమస్యగా మారుతోందని ఇసుక కొనుగోలుదారులు చెబుతున్నారు.

రూ.కోట్లలో లావాదేవీలు

రాష్ట్రవ్యాప్తంగా జేపీ సంస్థ మే 15 నుంచి ఈనెల 8 వరకు 64.33 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలు జరిపింది. 36.48 లక్షల టన్నులు వర్షాకాలం కోసం నిల్వ చేయగా, 27.85 లక్షల ఇసుకను అమ్మింది. ఇందులో పేదలందరికీ ఇళ్ల కాలనీలకు సరఫరా చేసింది దాదాపు లక్ష టన్నుల వరకు ఉంటుందని అంచనా. మిగిలినదంతా కొనుగోలుదారులు, బిల్డర్లు, గుత్తేదారులకు విక్రయించినదే. వీటికి టన్ను రూ.475 చొప్పున లెక్కిస్తే.. ఈ మొత్తం కోట్ల రూపాయల్లో ఉంటోంది.

ఇదంతా నగదు రూపంలోనే ఎందుకు తీసుకుంటున్నారని బిల్డర్లు, గుత్తేదారులు ప్రశ్నిస్తున్నారు. పెద్దఎత్తున ఇసుక అవసరమైన వారు ప్రతి ట్రిప్‌లో డ్రైవర్లకు నగదు ఇచ్చి ఎలా పంపుతామని ప్రశ్నిస్తున్నారు. డిజిటల్‌ చెల్లింపులు, చెక్కులకు అనుమతించాలని కోరినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. సాధారణంగా ఓ సంస్థ వస్తు కొనుగోళ్లకు మరో సంస్థకు ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వరకు మాత్రమే నగదు చెల్లింపులు చేసేందుకు ఆదాయపన్ను చట్టం అనుమతిస్తుంది. ఆపై ఎంతైనా నగదు రహిత చెల్లింపులే ఉండాలి.

జేపీ సంస్థ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదని చెబుతున్నారు. ఇదే విషయమై గత వారం క్రెడాయి ప్రతినిధులు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఎండీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. తాము చేపడుతున్న రహదారులు, వంతెనల పనులకు పెద్దఎత్తున ఇసుక అవసరమని, జేపీ సంస్థ నగదు రహిత చెల్లింపులు స్వీకరించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, వేర్వేరు విధాలుగా నగదు సమకూర్చుకొని ఇసుక తెప్పించుకోవాల్సి వస్తోందని, ఆ సంస్థ నిత్యం ఇంత భారీ మొత్తాన్ని నగదుగా మాత్రమే ఎలా తీసుకుంటోందని ఓ గుత్తేదారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

డిజిటల్‌ చెల్లింపులు తీసుకునేలా ఆదేశిస్తాం: ద్వివేది

‘ఇసుక కోసం నగదు మాత్రమే తీసుకుంటున్నారనే విషయం తెలియదు. నగదు రహిత లావాదేవీలైన డిజిటల్‌ చెల్లింపులు కూడా తీసుకోవాలి. దీనిని అమలు చేయాలని జేపీ సంస్థను ఆదేశిస్తాం’ అని గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

ఇదీ చదవండి:

కృష్ణా జలాలపై సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం!

ABOUT THE AUTHOR

...view details