'మట్టి మన సంస్కృతి.. మట్టి విగ్రహాలను పూజిద్దాం...పర్యావరణాన్ని కాపాడుకుందాం' అనే నినాదం ప్రజల్లోకి ఇప్పుడిప్పుడే బలంగా వెళుతోంది. ఓ వైపు కంటికి ఇంపుగా.. అందంగా, ఆకర్షణీయంగా ఉండే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెద్ద ఎత్తున పూజలు అందుకుంటున్నా....మరోవైపు మట్టి విగ్రహాల ప్రాముఖ్యత, వాటి ద్వారా పర్యావరణానికి కలుగుతున్న మేలుపై పలు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషికి ఇప్పుడిప్పుడే ఫలితం కనిపిస్తోంది. వివిధ రకాల సైజులు, ఆకారాలు, వైవిధ్యంగా తయారు చేస్తున్న మట్టి విగ్రహాలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది.
విజయవాడ నగరంలోని కాలనీలు, అపార్టుమెంట్లు, కూడళ్లలో ఏర్పాటు చేసే మండపాల్లోనూ మట్టి గణపతులను ప్రతిష్టించేందుకు పెద్ద ఎత్తున నిర్వాహకులు ముందుకు వస్తున్నారు. కృష్ణా జిల్లా తరకటూరుకు చెందిన సేవ్ లాంచి స్వచ్ఛంద సంస్థలు భారీ స్థాయిలో మట్టి విగ్రహాలను తయారుచేస్తున్నాయి. మట్టి విగ్రహాలను పూజిద్దాం....మన చెరువులను కాపాడుకుందాం అనే నినాదంతో నాలుగేళ్లుగా కృషి చేస్తున్నాయి. చేతి వృత్తులను ప్రోత్సహించి....వారికి పని కల్పించడమే కాక.. స్వదేశీ వస్తువులనే వాడాలనే భావనను పెంపొందిస్తున్నాయి.