RTC employees for PRC ప్రభుత్వంలో విలీనం అనగానే ఎగిరి గంతేశారు. సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇవ్వగానే సంబరపడిపోయారు. జీతాల పెంపు కోసం ఆశగా ఎదురుచూశారు. కాలం గడుస్తున్నా ఇప్పటికీ విలీన ఫలాలు ఆర్టీసీ ఉద్యోగులకు దక్కలేదు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరిగినా.. ఇప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చేయలేదు. సాంకేతిక సమస్యల పేరిట ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ప్రభుత్వానికి తుదిగడువు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు.. ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి.
ఆర్టీసీ ఉద్యోగులకు PRC అమలులో అలసత్వం
సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం ఆర్టీసీ ఉద్యోగులపై ముఖ్యమంత్రి జగన్ వరాల జల్లు కురిపించారు. 2020 జనవరి 1 నుంచి ప్రభుత్వంలో విలీనం చేశారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న విధంగానే.. ఆర్టీసీ ఉద్యోగులకూ జీతాలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరి నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు పెరిగినా.. ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చేయలేదు. సిబ్బంది ఆందోళనతో జూన్ 6న ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జూలై నుంచి పెంచిన వేతనాలు అందుతాయని ఆశ పడ్డారు. మళ్లీ నిరాశే ఎదురైంది. ఇప్పటికీ పాత జీతాలే ఇస్తున్నారు. ఉత్తర్వులిచ్చి నెలలు గడుస్తున్నా.. సాంకేతిక సమస్యల పేరిట అధికారులు తాత్సారం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.