సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులపై నిరాధార ఆరోపణలు గుప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డేకి లేఖ రాయడాన్ని దిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. దాన్ని న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకునే అనైతిక ప్రయత్నంగా అభివర్ణించింది. ముఖ్యమంత్రి లేఖ కోర్టు ధిక్కారమేనని అభిప్రాయపడింది. ఇదివరకు దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ ఎన్‌వీరమణ నీతి, నిజాయతీగల ఉత్తమ న్యాయమూర్తి అని.. ఆయనపై ఆరోపణలను ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు ఏకగీవ్ర తీర్మానం చేసింది.
‘‘సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై దిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గం బుధవారం సమావేశమై చర్చించింది. లేఖ రాయడాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6న ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి ప్రచారంలో పెట్టారు. అందులో జస్టిస్ ఎన్‌వీరమణ, హైకోర్టు న్యాయమూర్తుల ప్రవర్తనకు వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయపరిపాలన వ్యవస్థలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇది స్వతంత్ర న్యాయవ్యవస్థను భయపెట్టేందుకు చేసిన ప్రయత్నంలా కనిపిస్తోంది. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తిస్తున్న న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు బరితెగించి చేసిన ఈ ప్రయత్నాన్ని దిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది’’ అని తీర్మానంలో పేర్కొంది.
న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే కుట్ర