ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Pension:ఠంచను తప్పిన పింఛను - పింఛను పంపిణిలో ఆలస్యం

ప్రతి నెలా 1వ తేదీనే పింఛను పంపిణీ చేస్తామన్న ప్రభుత్వం మాట మారింది. గడువు క్రమంగా పెరుగుతూ పోతోంది. ఒకటో తేదీ నుంచి ఐదు రోజులకు మారింది. మూడు నెలల నుంచి ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. తాజాగా ఏప్రిల్‌ నెలలో పంపిణీ గడువును అధికారులు 9వ తేదీ వరకు  పొడిగించారు.

Pension
Pension

By

Published : Apr 18, 2022, 5:11 AM IST

‘వైఎస్సార్‌ పింఛను కానుక’ కింద లబ్ధిదారులందరికీ ప్రతి నెలా 1వ తేదీనే పింఛను పంపిణీ చేస్తామన్న ప్రభుత్వం మాట మారింది. గడువు క్రమంగా పెరుగుతూ పోతోంది. ఒకటో తేదీ నుంచి మొదట మూడు రోజులకు.. ఆపై ఐదు రోజులకు మారింది. తాజాగా ఏప్రిల్‌ నెలకు సంబంధించి అది ఏడు రోజులకు అటు తర్వాత 11 రోజులకు చేరినట్లయింది. ప్రభుత్వం 2020 ఫిబ్రవరి నుంచి వాలంటీర్ల ద్వారా పింఛను పంపిణీ ప్రారంభించింది. మొదట్లో మూడు పని దినాల పాటు పంపిణీ చేయగా అదే ఏడాది జులై నుంచి ఒకటో తేదీనే లబ్ధిదారులందరికీ అందించే విధానాన్ని తీసుకువచ్చింది. ఆ నెలలో ఎవరైనా అనివార్య కారణాల వల్ల పింఛను తీసుకోలేకపోతే తర్వాతి నెలలో రెండు నెలల మొత్తాన్ని కలిపి ఇచ్చేవారు. ఆరు నెలలపాటు ఈ విధానం కొనసాగింది. డిసెంబరు నుంచి మళ్లీ మూడు రోజుల పంపిణీ ప్రారంభించారు. మరికొన్నాళ్లకు అది కాస్తా నాలుగు రోజులు, తర్వాత ఐదు రోజులకు మారింది. అలాగే మూడు నెలల క్రితం వరకు పింఛను పంపిణీ చేసే ఒకటో తేదీ నాటికే నగదు మొత్తం బ్యాంకులకు చేరి వాలంటీర్ల చేతికి అందేది. మూడు నెలల నుంచి ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఏప్రిల్‌ నెలలో పంపిణీ గడువును అధికారులు 9వ తేదీ వరకు పొడిగించారు.

పోర్టబులిటీ సదుపాయం లేక..
నివాస ధ్రువీకరణ పత్రాలు ఒక గ్రామంలో ఉండి.. ఇతర అవసరాలరీత్యా వేరే గ్రామాలు లేదా పట్టణాల్లో ఉంటున్న లబ్ధిదారులు పోర్టబులిటీ విధానంలో అక్కడే పింఛను తీసుకునే వెసులుబాటు గతంలో ఉండేది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా గతేడాది వరకు ఈ విధానాన్ని కొనసాగించింది. ఆ తర్వాత దీన్ని రద్దు చేసింది. అంతేకాకుండా ఏ నెల పింఛను ఆ నెలలోనే తీసుకోవాలనే నిబంధనను తీసుకువచ్చింది. దీంతో వేరే ఊళ్లో పిల్లల దగ్గర ఉంటున్న వృద్ధులు, వైద్యం నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, పండుగలు, ఇతర శుభకార్యాల కోసం వేరే ఊళ్లకు వెళ్లిన వారు ఇక్కట్లకు గురవుతున్నారు. ఎక్కడ ఉన్నా పింఛను పంపిణీ తేదీ నాటికి నివాస గ్రామాలకు రావాల్సి వస్తోంది. లేకపోతే ఆ నెల పింఛను కోల్పోయే దుస్థితి నెలకొంది. దీంతోపాటు గత మూడు నెలలుగా బ్యాంకుల్లో సకాలంలో జమ కాకపోవడం వల్ల కొంతమంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. పింఛను కోసం 1వ తేదీనే ఇతర ప్రాంతాల నుంచి నివాస ధ్రువీకరణ పత్రాలు ఉన్న గ్రామాలకు చేరుకుంటున్న లబ్ధిదారులు బ్యాంకులో నగదు జమ కాకపోతే రెండు, మూడు రోజులపాటు అక్కడే ఉండి ఎదురు చూడాల్సి వస్తోంది. ఇప్పుడది ఏకంగా 9 రోజులకు చేరింది. దీంతో పింఛనుదారులకు మరిన్ని కష్టాలు తప్పడంలేదు.

ఇదీ చదవండి:'భారత్​లో తొమ్మిదేళ్లలో భారీగా తగ్గిన పేదరికం'

ABOUT THE AUTHOR

...view details