BDL Products Exhibition: యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే క్షిపణులు.. గగనతల లక్ష్యాలను చేధించే ఆస్త్రాలు.. సముద్రంలో షిప్‌పై నుంచి ప్రయోగించే టొర్పొడోలు.. నీటి అడుగున వాడే ఆయుధాలు.. సైనికుల రక్షణ కవచం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల వరకు.. ఇవన్నీ హైదరాబాద్‌లోని రక్షణ రంగ సంస్థలు భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్), మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని)లో తయారవుతున్నాయి. వీటిలో కొన్నింటిని డీఆర్‌డీవో డిజైన్ చేయగా.. మరికొన్నింటిని ఆయా సంస్థలే స్వయంగా అభివృద్ధి చేసి ఉత్పత్తి చేస్తున్నాయి. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా కంచన్‌బాగ్‌లోని బీడీఎల్, మిధానీలో తమ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. మంగళవారం మీడియాకు ప్రదర్శించారు. స్థానికంగా చదువుకుంటున్న విద్యార్థులతో పాటు నూజివీడు నుంచి ట్రిపుల్ ఐటీ ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రదర్శనను తిలకించేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ నెల 19 వరకు ఉదయం10 నుంచి సాయంత్రం 5 వరకు విద్యార్థులు, ప్రజలు సందర్శించవచ్చు.
బీడీఎల్‌లో..
ఆకాశ్:ఉపరితలం నుంచి గగనతలంలోని విమానాలను ధ్వంసం చేసే క్షిపణి. 25 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కూల్చేయగలదు. ఒకేసారి నాలుగింటిని ప్రయోగించవచ్చు.
వరుణాస్త్ర: జలాంతర్గాములను కూల్చే ఆస్త్రమిది. షిప్ నుంచి ప్రయోగిస్తారు. 70 కి.మీ. దూరం లక్ష్యాలను ధ్వంసం చేయగలదు.
పృథ్వి: ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే క్షిపణి. 100 నుంచి 350 కి.మీ. దూరంలోని లక్ష్యాలపై గురిపెట్టగలదు.
గరుడాస్త్ర: జలాంతర్గాములను ధ్వంసం చేసే టొర్పొడోస్ ఇది. తాల్, వరుణాస్త్ర కూడా ఈ కోవకు చెందినవి.
వీఎల్‌ఎంఆర్‌శామ్:వర్టికల్ లాంచింగ్ షార్ట్ రేంజ్ సర్ఫెస్ టూ ఎయిర్ మిసైల్. షిప్ మీద నుంచి నిటారుగా ప్రయోగించే అస్త్రం. డిజైన్ దశలో ఉంది.