చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను రాష్ట్రమంతటా జరుపుకున్నారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాలు.. ఆనంద కోలాహలంలో తేలియాడిన ఆబాల గోపాలం... బాణసంచా పేలుళ్లతో సందడిగా సాగింది.
దీపావళి సందర్భంగా రాజ్‌భవన్.. విద్యుత్ దీప కాంతుల మధ్య విరాజిల్లింది. కృష్ణా జిల్లా మైలవరంలో బొమ్మల కొలువులు.. లక్ష్మీ పూజలతో ప్రజలు దీపాలు అలంకరించి కరోనా నిబంధనలు పాటిస్తూ.. పండుగను జరుపుకున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా విజయవాడ నగరంలో టపాసులు కాలుస్తూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. తరాలు మారినా ఏ మాత్రం చెక్కుచెదరని ఆచారాన్ని పూర్వీకుల నుంచి నవతరం వరకు అంతా అదే కట్టుబాట్లను జైనులు కొనసాగిస్తున్నారు. మూడు రోజుల నుంచి ఉపవాసాలు ఉంటూ.. దీపావళి పండుగను అంగరంగా వైభవంగా జరుపుకుంటారు. గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడులో కొవిడ్ సెంటర్‌లో కరోనా బాధితుల మధ్య దీవాళి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఎంపీ డాక్టర్ బి వి సత్యవతి కుటుంబసభ్యులతో కలిసి వేడుకులు జరుపుకున్నారు.