ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెరుగుతున్న తీవ్రత.. జరగని పరీక్షలు - కరోనా టెస్టుల తాజా వార్తలు

రెండో దశలో కరోనా మహమ్మారి దేశంపై పంజా విసురుతోంది. నిత్యం వందల మందిని రాకాసి పొట్టన పెట్టుకుంటోంది. కుటుంబంలో ఒకరికి నిర్ధరణ అయిందంటే... ఆ ఇళ్లంతా రాకాసి కోరల్లో చిక్కుకుంటోంది. ఎవరి నుంచి ఎవరికి వస్తుందో తెలియదు... ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియదు. ఈ క్రమంలో భయందోళనకు గురయ్యే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నిర్ధరణకున్న ఏకైక మార్గం... టెస్టింగ్. కానీ, పెరుగుతున్న తీవ్రతకనుగుణంగా ఎక్కడా పరీక్షలు జరగకపోవటం ఆందోళనకు గురిచేస్తోంది.

corona tests
కరోనా నిర్ధారణ పరీక్షలు

By

Published : May 6, 2021, 9:43 AM IST

ప్రపంచానికి పరిచయంలేని మహమ్మారి గతేడాది ఒక్కసారిగా విరుచుకుపడినా... సౌకర్యాల విషయం పెద్దగా సమస్య ఉత్పన్నం కాలేదు. రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే కేసులు నమోదైనా... ప్రభుత్వం పట్టుబట్టి మరీ నియంత్రించగలిగింది. ప్రస్తుతం సునామీ వేగంతో వైరస్‌ వ్యాపిస్తోంది. నిత్యం వేలమంది కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. సామర్థ్యానికి మించి బాధితులు ఆస్పత్రులకు వరస కడుతున్నారు. తొలినాళ్లలో ఎక్కడ అనుమానం వచ్చినా.. వారిని పట్టుకుని మరీ... పరీక్షలు జరిపారు. కానీ.... దూసుకువస్తున్న రెండో దశ వ్యాప్తితో రాష్ట్రంలో వైద్యవ్యవస్థ సతమతమవుతోంది. టెస్ట్‌ కిట్‌లు ఏ మాత్రం సరిపోక... కేంద్రాలను మూసివేసే పరిస్థితి నెలకొంది.

అత్యధికంగా లక్షా 30వేల టెస్టులు

రాష్ట్రంలో ఏప్రిల్‌ 20 నుంచి చూస్తే.. ఆ రోజు అత్యధికంగా లక్షా 30వేల టెస్టులు నిర్వహించారు. ఇప్పుడు దాదాపు 70 వేలకు అటూఇటూగా ఉంటున్నాయి. సొంతూళ్ల నుంచి 10, 20 కిలోమీటర్ల దూరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి... ఉదయం 6 గంటలకే వరుస కట్టినా పరీక్ష జరుగుతుందన్న భరోసా లేకుండా పోయింది. వైద్యారోగ్య సిబ్బంది ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి పది పదిహేను నిమిషాలకే కిట్లు అయిపోయాయని చెబుతున్నారు. కిట్ల సంఖ్యకు తగ్గట్టు టోకెన్లు జారీచేసి.... మిగతా వారిని వెనక్కి పంపుతున్నారు. సకాలంలో కరోనా నిర్ధరణ పరీక్షలు చేయక, ఫలితంగా వైద్యం అందడంలో జాప్యంతో బాధితుల ఆరోగ్యం క్షీణించి అత్యవసర వైద్య కేటగిరీలోకి వెళ్తున్నారు. ప్రైవేటులో ఏప్రిల్‌ 20 నుంచి గణాంకాలను పరిశీలిస్తే.... ప్రతిరోజూ సగటున 18 వేలకు పైగా పరీక్షలు జరుగుతున్నాయి. వారం రోజులుగా మొత్తం పరీక్షల్లో 25 శాతం ప్రైవేటు కేంద్రాల్లో చేసినవే ఉన్నాయి.

అత్యధికంగా 10వేల 122 కేసులు

ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరాల మేరకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించకపోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రైవేటు ల్యాబ్‌ల్లో 15వందల రూపాయల వరకు తీసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల జనం తాకిడి ఎక్కువగా ఉంటే 2 వేల రూపాయల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఆర్టీపీసీఆర్​కు 5వందలు, ఇంటికి వచ్చి పరీక్ష నిర్వహిస్తే 750 రూపాయలు తీసుకోవాలి. మరోపక్క పరీక్షల సంఖ్య ఎక్కువ ఉంటే కేసులు ఎక్కువగా, తగ్గితే తక్కువగా వస్తున్నాయి. ఏప్రిల్‌ 26న అత్యధికంగా 10వేల 122 కేసులు వచ్చాయి. ఆరోజు జరిగిన మొత్తం 99వేల 638 పరీక్షల్లో పాజిటివ్‌ రేటు 10.15 శాతంగా నమోదైంది. మే 4న పరీక్షల సంఖ్య 77వేల 435 కాగా.... పాజిటివ్‌ రేటు 8.21 గా ఉంది. ఈ తొమ్మిది రోజుల సగటు 9.67గా నమోదైంది.

ప్రభుత్వాల నిర్లక్ష్యమే

కరోనా ప్రవేశించి... ఏడాదికి పైగా గడుస్తున్నా.... ఇప్పటికీ సౌకర్యాలు కల్పనలో ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి దారితీసిందని నిపుణులు భావిస్తున్నారు. కనీసం టెస్టు కిట్‌లైనా సమకూర్చుకోకపోవటంతో పేద, మధ్య తరగతి ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండాపోయిందని చెబుతున్నారు. మూడో దశ ముప్పు సైతం పొంచి ఉందంటున్న హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని... ముందస్తు ఏర్పాట్లతో కిట్‌ల కొరత తీర్చి... పరీక్షల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:6 గంటలపాటు.. ధూళిపాళ్ల నరేంద్రను ప్రశ్నించిన అనిశా

ABOUT THE AUTHOR

...view details