Yadadri temple news: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి నిత్యారాధనలు, కల్యాణపర్వం కన్నులపండువగా జరిగింది. సుప్రభాతంతో మొదలైన ఆలయ కైంకర్యాలు.. వేకువజామున మేల్కొలుపు నిర్వహించాక ప్రతిష్ఠామూర్తులకు ఆలయ అర్చకులు హారతి నివేదన జరిపారు.
పాలతో అభిషేకించి తులసీ పత్రాలతో అర్చన చేశారు. స్వర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్చారణలతో అష్టోత్తరం, సుదర్శన హోమం చేపట్టారు. శ్రీ స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణోత్సవం భక్తులకు కనువిందు కలిగించింది.
కరోనా నిబంధనల దృష్ట్యా ఈవారం ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. నిత్యం సందడిగా ఉండే ఆలయ పరిసరాల్లో భక్తులు లేకపోవడంతో అరగంటలోపే స్వామి వారిని దర్శనం చేసుకుని వెనుదిరుగుతున్నారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా భక్తులకు అధికారులు లఘు దర్శన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా పోలీసులు కొండపైకి వాహనాల అనుమతి నిరాకరించారు.