రాష్ట్రంలో వేరుసెనగ సాగు తగ్గిపోతోంది. ఖరీఫ్‌లో వరి తర్వాత ప్రధాన పంట ఇదే. కానీ ఈ ఏడాది వర్షాలు అనుకూలించకపోవడం.. పెట్టుబడులు పెరగడంతోపాటు.. దిగుబడులు తగ్గిపోవడంతో ఈ పంట విస్తీర్ణం పడిపోతోంది. రెండు మూడేళ్లుగా వరస నష్టాలతో రైతులు వేరుసెనగ అంటేనే భయపడుతున్నారు. సగటున ఎకరాకు దిగుబడి రెండు క్వింటాళ్లు దాటడంలేదు. విత్తన ఖర్చులైనా దక్కడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ పంటల గురించి ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 18.25 లక్షల ఎకరాలు ఉండగా.. జులై ఆఖరుకు 7.50 లక్షల ఎకరాల్లోనే సాగైంది. రైతులు పత్తి, కంది, ఇతర పంటలపై దృష్టి సారిస్తున్నారు. వేరుసెనగ సాగు తగ్గిపోవడంతో.. నూనెగింజల ఉత్పత్తి గణనీయంగా తగ్గే అవకాశముంది.
పొలాలకు చేరని విత్తులు:జూన్‌లో మొదట కొన్నాళ్లు వర్షాలు బాగానే ఉన్నా.. తర్వాత ముఖం చాటేశాయి. జులై చివరి వారం వరకు అనుకూలించలేదు. దీంతో తెచ్చిన విత్తనాలు ఇళ్లలోనే ఉండిపోయాయి. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వేరుసెనగ సాగు అధికం. 11.07 లక్షల ఎకరాలు సాధారణ విస్తీర్ణం కాగా.. జులై ఆఖరుకు 4.92 లక్షల ఎకరాల్లోనే సాగైంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2.22 లక్షల ఎకరాలకు గాను.. 77 వేల ఎకరాల్లోనే విత్తనం పడింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 1.60 లక్షల ఎకరాలకు లక్ష ఎకరాల్లోనే వేసినట్లు వ్యవసాయ గణాంకాలు పేర్కొంటున్నాయి.
* వేరుసెనగ సాగుకు ఎకరాకు రూ. 30,000 వరకు పెట్టుబడి అవుతోంది. మూడేళ్లలో ఎరువులు, విత్తనం, సాగు ఖర్చులు భారీగా పెరిగాయి. దిగుబడులు మాత్రం వర్షాధారంగా ఎకరాకు రెండు క్వింటాళ్లకు మించడం లేదు. భారీవర్షాలతో గతేడాది పశుగ్రాసమైనా మిగల్లేదు. పంటల బీమా ఎకరాకు రూ.738 నుంచి రూ.4,000 వరకే లభించింది.