ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బహిరంగ రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.17,750 కోట్లకు చేరుకుంది. రిజర్వు బ్యాంకు మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రాష్ట్రం రూ.1,750 కోట్ల మేర రుణం పొందింది. వెయ్యి కోట్ల రూపాయలను 14 సంవత్సరాల కాలపరిమితితో 7.12% వడ్డీకి తీసుకుంది. రూ.750 కోట్లను 15 ఏళ్ల కాలపరిమితితో 7.14% వడ్డీ చెల్లించేందుకు అంగీరిస్తూ సమీకరించింది. వీటిని కలిపితే మొత్తం బహిరంగ రుణం రూ.17,750 కోట్లకు చేరింది. తొలి తొమ్మిది నెలల కాలానికి కేంద్రం రూ.20,751 కోట్ల మేర అప్పు తీసుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ లెక్కన చూస్తే డిసెంబరు వరకు రూ.3,000 కోట్లను మాత్రమే అప్పుగా తీసుకునేందుకు అవకాశం లభిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ అప్పులపై దృష్టి పెట్టింది. ఏయే రూపేణా ఎంత అప్పు తీసుకున్నారో లెక్కలన్నీ ఇవ్వాలని కోరింది. వాటి ఆధారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న రుణ పరిమితికి కోత పెట్టి ఏడాది మొత్తం మీద రూ.27,688.68 కోట్ల అప్పునకే అవకాశం కల్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3) ప్రకారం ఏ రాష్ట్రం ఎంత మేర అప్పు తీసుకునేందుకు వీలుందో కేంద్రమే నిర్ణయిస్తుంది. రిజర్వు బ్యాంకు ఆయా రాష్ట్రాలను సంప్రదించి ఏ రాష్ట్రం ఎప్పుడు ఎంత అప్పు తీసుకునే అవకాశం ఉందో క్యాలెండర్‌ను ముందుగా విడుదల చేస్తుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సంప్రదించి జులై నుంచి సెప్టెంబరు వరకు రుణ క్యాలండర్‌ను రిజర్వు బ్యాంకు విడుదల చేసింది. ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెప్టెంబరు 7 వరకు మరో రూ.5,000 కోట్లు రుణం తీసుకునే అవకాశముంది.
ప్రతి నెలా రూ.5వేల కోట్ల రుణం...