కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం, ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల అభివృద్ధికి అవసరమైన నిధుల్లో రూ.9వేల కోట్లను రుణంగా సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయిదు జాతీయ బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడి అప్పులిచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నాయి. వైద్య విద్యలో బి-కేటగిరి సీట్ల భర్తీతో విద్యార్థుల నుంచి వచ్చే ఫీజు, రోగులకు అందించే చికిత్సకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ఆసుపత్రులకు వచ్చే ఫీజులు, ప్రభుత్వ హామీతో.. ఈ అప్పులు చెల్లిస్తామని బ్యాంకులకు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ విషయంలో బ్యాంకుల నిబంధనలకు అనుగుణంగా నడుచుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 16 కొత్త వైద్య కళాశాలల నిర్మాణంతోపాటు ప్రస్తుత వైద్య కళాశాలలను నాడు-నేడు కింద అభివృద్ధి చేసేందుకు రూ.16 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో సుమారు రూ.9 వేల కోట్లను రుణాలుగా పొందేందుకు ఏడాది కాలంగా ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి కార్పొరేషన్ ద్వారా అధికారులు వివిధ బ్యాంకులతో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో విడివిడిగా కాకుండా అయిదు జాతీయ బ్యాంకులు కన్సార్షియం కింద ఏర్పడి, రుణాలు ఇచ్చేందుకు మొగ్గుచూపినట్లు తెలిసింది. అలాగే... నాబార్డు నుంచి కూడా రుణాలు తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ గ్యారంటీతో పొందే ఈ అప్పులను 20 ఏళ్లలో తిరిగి చెల్లిస్తామని చెబుతున్నారు.
అనకాపల్లి, నంద్యాలలో మొదలవని నిర్మాణాలు