CRDA DPR for Rs 3,000 crore Loan: అమరావతిలో ప్రధాన మౌలిక వసతుల పనులు, ఎల్పీఎస్ లేఅవుట్‌ల అభివృద్ధికి బ్యాంకుల నుంచి 3వేల కోట్ల రుణం పొందేందుకు సీఆర్డీఏ ఒక సవివర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయించింది. 481 ఎకరాల భూమిని దశలవారీగా విక్రయించి రుణం, వడ్డీ తిరిగి చెల్లిస్తామని అందులో వివరించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ఈ నెల 9న అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి పురపాలకశాఖకు వెళ్లింది. బ్యాంకుల నుంచి 3వేల కోట్ల రుణం తీసుకునేందుకు సీఆర్డీఏ.... కొన్ని నెలలుగా ప్రయత్నిస్తోంది. ఆ మొత్తానికి హామీ ఇచ్చేందుకు ప్రభుత్వమూ అంగీకరించింది.
Loan on amaravathi lands: ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చాక అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు, ఎల్పీఎస్ లేఅవుట్‌ల అభివృద్ధికి గతంలో రూపొందించిన ప్రణాళికల్ని రూ. 11వేల 92 కోట్లకు కుదించింది. ఈ మొత్తంలో బ్యాంకుల నుంచి 10వేల కోట్లు రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది. తొలి దశలో 3వేల కోట్లు, రెండో దశలో 3వేల కోట్లు, మూడో దశలో 4వేల కోట్ల రుణం తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. 3వేల కోట్ల రుణానికి హామీ ఇచ్చేందుకు సంసిద్ధత తెలియజేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 24నే జీవో జారీ చేసింది. ఆ మొత్తంలోనూ మొదట 15 వందల కోట్ల పనులు చేయాలని ఆ తర్వాత మిగతా పనుల సంగతి చూద్దామని.. సీఆర్డీఏకి సూచించినట్టు సమాచారం. రాజధాని కేసుల్లో ఇటీవల హైకోర్టుకు సమర్పించిన అదనపు అఫడవిట్‌లో 15 వందల కోట్లతో రాజధానిలో పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఆర్డీఏ ప్రస్తావించింది.
రాజధానిలో తొలి దశలో చేపట్టాలనుకుంటున్న పనుల విలువ.. 3 వేల 760 కోట్ల 4 లక్షలుగా ఉందని... డీపీఆర్‌లో సీఆర్డీఏ ప్రతిపాదించింది. ఆ మొత్తంలో రుణం 2 వేల 994 కోట్ల 46 లక్షలుగా ఉండగా.. ప్రభుత్వ వాటా 765 కోట్ల 58 లక్షలు ఉంది. ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి రూ.650 కోట్ల 58 లక్షలతో పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. తొలి దశలో ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులకు 12 వందల 6 కోట్ల 39 లక్షలు, ఎల్పీఎస్ లేఅవుట్‌ల అభివృద్ధికి 17 వందల 88 కోట్ల 7 లక్షల్ని వెచ్చిస్తారు. విద్యుత్ లైన్‌ల ఏర్పాటుకు 115 కోట్లు కేటాయిస్తారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం తన వాటాగా చెల్లిస్తుంది. ఈ పనుల కాల వ్యవధి 18 నెలలుగా పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం కోరుతున్న 3 వేల కోట్ల రుణంలోనూ తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌గా 14 వందల 84 కోట్ల 95 లక్షలు వెచ్చిస్తారు.