అర్ధరాత్రిలోగా విధుల్లో చేరని.. RTC కార్మికులను ఎట్టిపరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చుకోవద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విధుల్లో చేరేందుకు ఇచ్చిన అవకాశం ఉపయోగించుకుని... ఉద్యోగాలు కాపాడుకోవడమా లేక ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసుకుంటారో కార్మికులే తేల్చుకోవాలని సూచించింది. గడువులోగా చేరకుంటే మిగిలిన 5వేలమార్గాల్లోనూ ప్రైవేట్ వాహనాలకు అనుమతులివ్వాలని... అప్పుడు రాష్ట్రంలో ఆర్టీసీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సీనియర్ అధికారులతో సమీక్ష
ఆర్టీసీ సమ్మె, సమ్మెవిషయంలో ఈనెల 7న హైకోర్టు విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్కే జోషి, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారావు సహా... సీనియర్ అధికారులతో సమీక్షించారు. సమ్మెవిచారణ సందర్భంగా అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు.
అర్ధరాత్రితో గడువు ముగింపు
కార్మికచట్టాలు, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించడంతో పాటు న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నారు. కార్మికుల కుటుంబాల భవిష్యత్.. కార్మికుల చేతుల్లోనే ఉందని సమావేశం అభిప్రాయపడింది. సమ్మె చట్ట విరుద్ధమైనదని.. కార్మిక శాఖ నివేదిక ఇచ్చినా మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఇచ్చిన అవకాశం వినియోగించుకోకుంటే అర్థంలేదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకుంటే, మిగిలిన ఐదువేల మార్గాల్లోనూ ప్రైవేట్ వాహనాలకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని.. ఐదో తేదీ అనగా ఇవాళ అర్ధరాత్రి తర్వాత ఆ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపింది.
దానికి కార్మికులే కారణం
అదే జరిగితే రాష్ట్రం.. ఆర్టీసీ రహిత రాష్ట్రంగా మారుతుందని... ఆ పరిస్థితికి ముమ్మాటికీ కార్మికులే కారణమవుతారని వ్యాఖ్యానించింది. హైకోర్టులో విచారణను చూపి కార్మిక సంఘాల నేతలు కార్మికులను మభ్యపెడుతున్నారని... న్యాయనిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మెవిషయంలో న్యాయస్థానం... ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదని సమావేశం అభిప్రాయపడింది.