గులాబ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలోని మూసీనది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసీనదికి పోటెత్తిన భారీ వరద ప్రవాహంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం(Dead Body in Moosi river) కొట్టుకొచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం గజ ఈతగాళ్లు, ఎస్డీఆర్ఎఫ్ను రంగంలోకి దింపారు. అయితే ముసీలో వరద ఉద్ధృతి కారణంగా మృతదేహం వెలికి తీయడం సాధ్యం కాలేదు. మూసారాంబాగ్ బ్రిడ్జ్ సమీపంలోని కృష్ణనగర్ వెనుకవైపు ఉన్న మూసీ నదిలో మృతదేహం కొట్టుకు పోతోంది. ఈస్ట్ జోన్ ఏసీపీ వెంకటరమణ పర్యవేక్షణలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
నదీ పరిసర ప్రాంతాల్లో హైఅలర్ట్
దీంతో జీహెచ్ఎంసీ(ghmc laert) సిబ్బందిని అప్రమత్తం చేసింది. చాదర్ ఘాట్, మూసారాంబాగ్, ఓల్ట్ మలక్ పేట్ ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. దిగువ ప్రాంతంలో ఎక్కడైనా మృతదేహం కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మరోవైపు వరద ఉధృతి పెరిగిన దృష్ట్యా... నది పరిసరాల్లోకి ఎవరిని రావద్దని అధికారులు హెచ్చరించారు. మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిపేశారు. చాదర్‌ఘాట్ చిన్న బ్రిడ్జిపై కూడా రాకపోకలు నిలిపివేసిన పోలీసులు... పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చాదర్‌ఘాట్, శంకర్‌నగర్ ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా హైఅలర్ట్ ప్రకటించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.