Begging For Father's Funeral : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్‌కు చెందిన ఒంటెద్దు దుర్గయ్య కూలీ. పాములు పట్టడం వ్యాపకం. ఆయనకు కుమార్తె రాజేశ్వరి, కుమారుడు కాశీరాం ఉన్నారు. భార్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. కుమార్తె గతేడు పదో తరగతి పూర్తిచేసింది. అప్పట్నుంచి ఆమెను బంధువుల ఇంట్లో ఉంచిన దుర్గయ్య.. పదిహేనేళ్ల కుమారుడితో కలిసి ఊరి చివరన గుడిసెలో నివసిస్తున్నాడు.
గ్రామంలో ఎవరింట్లోకి పాము వచ్చినా దుర్గయ్యకు సమాచారమివ్వడం, ఆయన పట్టుకుని అటవీ ప్రాంతంలో వదలడం ఆనవాయితీ. ఆదివారం ఓ కాలనీలో పాము సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో వెళ్లి పట్టుకున్నాడు. సంచిలో వేస్తుండగా పాము చేతిపై కాటు వేయడంతో మరణించాడు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని సోమవారం గ్రామానికి తీసుకొచ్చారు.