తెలంగాణలోని హైదరాబాద్ జవహర్ నగర్ ఠాణా పరిధిలోని యాప్రాల్ కింది బస్తీలో వెంకట్ స్వామి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమారులు. కల్లు కంపౌండ్లు నిర్వహిస్తూ ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. వెంకట్ స్వామి చిన్న కుమారుడు యశ్వంత్ 2016లో సోని అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 23న బంధువుల పెళ్లి కోసం వెంకట్ స్వామి కుటుంబ సభ్యులంతా ఇంటికి తాళం వేసి వెళ్లారు. చిన్న కోడలు సోని అంతకంటే నాలుగు రోజుల ముందే తల్లిగారింటికి వెళ్లిపోయింది. వెంకట్ స్వామి, కుటుంబ సభ్యులు రాత్రి 10 గంటలకు ఇంటికి తిరిగొచ్చే సరికి తలుపు తెరిచి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూసే సరికి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. పడకగదిలోకి వెళ్లి బీరువాను చూస్తే తెరుచుకొని ఉంది. అందులో ఉన్న బంగారు కూడా కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు వెంకట్ స్వామి గుర్తించాడు. బీరువాలో ఉన్న 44తులాల బంగారం, 15తులాల వెండి, 10500 నగదు ఎత్తుకెళ్లినట్లు వెంకట్ స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి పోలీసులు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెంకట్ స్వామిని ప్రశ్నించారు. పెళ్లి వేడుకకు ఎవరెవరు వెళ్లారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. చిన్న కోడలు సోని తప్ప మిగతా వాళ్లందరూ పెళ్లి వేడుకకు వెళ్లినట్లు వెంకట్ స్వామి పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలతో పాటు.. చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు.