ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు సంజీవయ్య శత జయంతి - damodaram sanjeevaiah birth annivarsary

దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా సేవలందించిన దామోదరం సంజీవయ్య శత జయంతి నేడు. పలు సంక్షేమ పథకాలతో ప్రజలకు ..అభివృద్ధివైపు వారధిని చూపించారు. తాత్కాలిక పార్లమెంటు సభ్యుడిగా వెళ్లి...తనకంటూ ఓ చరిత్రను లిఖించుకున్నారు. ప్రభుత్వ సంస్థల నిర్మాణంలో ఆయన కృషి ముందుంది. ప్రజల క్షేమానికి నిరంతరంగా పాటుపడిన సంజీవయ్య..నిజాయతీగా పాలన చేశారు.

damodaram sanjeevaiah 100th birth annivarsary
నేడు సంజీవయ్య శత జయంతి

By

Published : Feb 14, 2021, 12:12 PM IST

జాతి శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన నిష్కళంక, నిస్వార్థ, నిరాడంబర నేత దామోదరం సంజీవయ్య. కర్నూలు జిల్లాలోని మారుమూల కుగ్రామం పెదపాడులో నిరుపేద దళిత కుటుంబంలో ఆయన జన్మించారు. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా 1960 జనవరి 11న బాధ్యతలు స్వీకరించారు. అతి చిన్న (38 సంవత్సరాల) వయసులో ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా భారత ప్రజాస్వామ్య చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పుటను ఏర్పాటు చేసుకున్నారు. అంతకుముందు రాష్ట్ర మంత్రిగా పాలనానుభవాన్ని గడించారు. కేంద్ర పరిశ్రమల మంత్రిగా ఒక పర్యాయం, కార్మిక శాఖ మంత్రిగా మరో మారు, అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీకి రెండు సార్లు అధ్యక్షులుగా దేశ రాజకీయాల్లోనూ రాణించారు. 1921 ఫిబ్రవరి 14న మునయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించిన సంజీవయ్య బాల్యంలో పెదపాడు నుంచి కర్నూలుకు రోజూ అయిదు మైళ్లు కాలినడకన వెళ్లి విద్యనభ్యసించారు. అనేక కష్టాలను, పేదరిక బాధలను అనుభవిస్తూ ఎస్‌ఎస్‌సీలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యారు. 1942లో అనంతపురం కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. అనంతరం పౌరసరఫరాల శాఖలో చిరుద్యోగిగా జీవితం ప్రారంభించిన ఆయన, న్యాయ శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1950 సంవత్సరంలో తాత్కాలిక పార్లమెంటు సభ్యులుగా వచ్చిన అవకాశంతో ఇక రాజకీయంగా ఆయన వెనుతిరిగి చూడలేదు.

కార్మికులకు ఆత్మబంధువు

సేవాదృక్పథం, ఉన్నత వ్యక్తిత్వం, మేధాసంపత్తి, సాహితీ, ఆంగ్ల- హిందీ భాషా పరిజ్ఞానాలు, రాజనీతిజ్ఞతలు అనతికాలంలోనే ఆయనను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాయి. కేంద్ర పరిశ్రమలు, కార్మిక శాఖల మంత్రిగా ఆయన చేపట్టిన చర్యలు గణనీయమైనవి. యజమానులు, కార్మికులు దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని ఉద్బోధించేవారు. కార్మికుల సంక్షేమాన్ని కాంక్షించి వారికి ఆత్మబంధువయ్యారు. వీరి కాలంలో వచ్చిన అనేక సంస్కరణలు, చట్టాలు భావితరాలకు మార్గదర్శకం అయ్యాయి. ఆయన పదవీకాలంలోనే ఒప్పంద కార్మికుల చట్టం, కార్మికుల నష్టపరిహార చట్టం, కార్మిక సంస్థల చట్టం, బాల కార్మిక చట్టం, రవాణా వాహన కార్మికుల చట్టం, పారిశ్రామిక విధానాల చట్టం, కనీస వేతనాల చట్టం అమలులోకి వచ్చాయి. బోనస్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు పరచి కార్మికుల దృష్టిలో ‘బోనస్‌ సంజీవయ్య’గా ఖ్యాతి పొందారు. నూతన పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకంగా అనువైన స్థలాల కేటాయింపు, పన్నుల్లో మినహాయింపు, మౌలిక వసతుల కల్పనకు రాయితీలను మంజూరు చేసి పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులను ప్రోత్సహించారు. ప్రభుత్వరంగ సంస్థలను స్థాపించేందుకు కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంజీవయ్య రెండేళ్ల స్వల్ప కాలం మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన అనేక వినూత్న పథకాలతో ప్రజా సంక్షేమానికి పాటుపడ్డారు. ఆరు లక్షల ఎకరాల బంజరు భూములను నిరుపేదలకు పంపిణీ చేశారు. పారిశ్రామిక అభివృద్ధి సంస్థ, అవినీతి నిరోధక శాఖలను ఏర్పాటు చేశారు. ఉచిత నిర్బంధ విద్యను అమలుపరచారు. భవన నిర్మాణ వ్యవహారాలను చూసేందుకు పరిశ్రమల శాఖలో ప్రత్యేక విభాగం, చిన్నతరహా పరిశ్రమల సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ భూగర్భ గనుల సంస్థలను నెలకొల్పారు. జంటనగరాల్లో పారిశ్రామిక ప్రదేశాల గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన సమన్వయ సంఘం గుర్తించిన రెండు వేల ఎకరాల భూ సమీకరణ ఆయన హయాములోనే జరిగింది. రిజర్వేషన్ల శాతాన్ని ఎస్సీ, ఎస్టీలకు 14 నుంచి 17కి, బలహీన వర్గాలకు 24 నుంచి 38కి పెంచారు. తాలూకా స్థాయిలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలని ఉత్తర్వులిచ్చారు. సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, లలితకళల అకాడమీలను ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా వజ్రోత్సవాలను నిర్వహించారు. హైదరాబాద్‌లో రవీంద్ర భారతిని నెలకొల్పారు. అఖిలభారత సర్వోదయ సమ్మేళనానికి ప్రోత్సాహం, అంతర్జాతీయ తెలుగు రచయితల సమ్మేళనం నిర్వహణ- ఆయన చూపించిన దార్శనికతకు దర్పణాలు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి పేదరిక బాధలను చవిచూసిన సంజీవయ్య నిరంతరం కష్టపడేవారు. అందివచ్చిన అవకాశాన్ని దేశ భవిష్యత్తుకు, ఆర్థిక ప్రగతికి, పారిశ్రామికీకరణలో సరళీకరణ విధానాల ద్వారా దేశ పునర్నిర్మాణానికి బాటలు వేశారు. హైదరాబాద్‌లో అనేక ప్రభుత్వరంగ సంస్థలను స్థాపించడంలో ఆయన కృషి మరువరానిది. అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి అహర్నిశలూ పాటుపడిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడు సంజీవయ్య.

‘సంక్షేమం’తో ప్రజలకు చేరువ

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్వగ్రామంలోని తన ఇంటికి వచ్చి, తల్లి యోగక్షేమాలు తెలుసుకొని తిరిగి వెళుతున్న సందర్భంలో ఆమెకు వంద రూపాయలు ఇచ్చి- వృద్ధాప్యంలో ఉన్న నిరుపేదల పరిస్థితి ఏమిటంటూ ఆయన ఆలోచించారు. అప్పుడే వృద్ధాప్య పింఛను పథకానికి రూపకల్పన చేసి అమలుపరచారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేశారు. అందులో భాగంగా నిరుపేద చర్మకారుల సంక్షేమానికి, వారి ఆర్థికాభివృద్ధికి చర్మకారుల ఆర్థిక సహకార సమాఖ్యను, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చే ప్రత్యేక ఆర్థిక సహకార సంస్థలను ఏర్పాటు చేశారు. దళిత వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనాలను ప్రవేశపెట్టారు. 30కి పైగా సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేశారు. తెలుగు భాష అభివృద్ధికి, సాహితీ సంస్థలకు ప్రోత్సాహాన్నిచ్చిన వ్యక్తిగా సంజీవయ్య గొప్పదనాన్ని నేటికీ సాహితీవేత్తలు ప్రస్తుతిస్తారు. 1972 మే నెల ఏడో తేదీన ఆయన పరమపదించారు. అనేక పదవులు నిర్వహించినా మరణించే నాటికి ఆయనకు సొంత ఇల్లు లేదు. కొద్దిపాటి అయినా నగదు, సెంటు భూమి సైతం లేవు. పేదరికంలో మగ్గుతున్న తన కుటుంబ సభ్యులకు ఒక ఇంటి స్థలాన్ని కూడా సిఫార్సు చేయని నిజాయతీపరుడు ఆయన. రిక్షాలో అసెంబ్లీకి వెళ్ళివచ్చిన నిరాడంబరులు. నేటి తరానికి నిజమైన ఆదర్శప్రాయులు!

- నేలపూడి స్టాలిన్‌ బాబు (మేనేజింగ్‌ ట్రస్టీ, దామోదరం సంజీవయ్య ఫౌండేషన్‌)

ఇదీ చూడండి.మేల్కొనడానికి మహత్తరమైన బ్రహ్మీ ముహూర్తం ఎప్పుడంటే..

ABOUT THE AUTHOR

...view details