కరోనా దెబ్బతో అంతా అతలాకుతలమైంది. అన్నీ మారిపోయాయి. కానీ అడ్డాకూలీల దినచర్యల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఈసారి వీళ్ల ఎదురుచూపులు పనికోసం కాదు ఆకలి తీర్చే దాతల కోసం. పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోవడం వల్ల పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడింది తెలుగు రాష్ట్రాల వలస కూలీలకు. లాక్‌డౌన్ కాలంలో ఇక్కట్లు పడుతున్న వలస కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులో తెలుగు కూలీలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ నగరాన్ని నమ్ముకుని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన కూలీలు.
తక్కువ ఖర్చు...
హైదరాాబాద్‌లోని దాదాపు 200 దాకా కూలీల అడ్డాలున్నట్లు అంచనా. వీటిలో ప్రతిరోజూ 200కుపైగా కూలీలు జమయ్యే పెద్ద అడ్డాలు బోరబండ, నాంపల్లి, ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బాలానగర్, మెహిదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో ఉండగా.. ఎక్కువ అడ్డాలు పాతబస్తీలోనే ఉన్నాయి. పేద లేబర్లకు తక్కువ ఖర్చులతో ఆశ్రయమిచ్చే ప్రాంతాలిక్కడ ఉండటమే అందుకు కారణం. ఇక్కడున్న చార్మినార్, చాంద్రాయణగుట్ట, డబీర్‌పుర, యాకుత్‌పుర, బహదూర్‌పుర, కిషన్‌బాగ్, ఫలక్‌నుమా, ఎర్రకుంట, సంతోష్‌నగర్ ప్రాంతాల్లో ఇవి కొనసాగుతున్నాయి. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 40 శాతం ఉండగా.. మిగతా 60 శాతం తెలుగు రాష్ట్రాల నుంచి నగరాన్ని నమ్ముకొని వచ్చినవారే.