గులాబ్ తుపాన్ (Gulab Cyclone) ప్రభావంతో హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు (Hyderabad rains) కురుస్తున్నాయి. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతి నగర్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఈఎస్‌ఐ, అమీర్‌పేట, రహమత్ నగర్, యూసఫ్‌గూడ శ్రీకృష్ణ నగర్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. శ్రీకృష్ణనగర్ రహదారిపై నడుములోతు వరద నీరు వచ్చి చేరింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో కుండపోత వాన పడుతోంది. మాదాపూర్‌లో రహదారులు చెరువును తలపిస్తున్నాయి. జూబ్లీహిల్స్-హైటెక్‌సిటీ మార్గంలో 2 కి.మీ వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్ సీవోడీ వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జూబ్లీహిల్స్ నుంచి వచ్చే వాహనాలను కేబుల్ బ్రిడ్జ్ మీదుగా మళ్లిస్తున్నారు. మాదాపూర్ అమర్ సొసైటీ, నెక్టార్ గార్డెన్ కాలనీల్లో భారీగా వరద వచ్చింది.
లోతట్టు ప్రాంతాలు జలమయం
హిమాయత్‌నగర్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, బషీర్‌బాగ్, నారాయణగూడ, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, తుర్కయాంజాల్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, యాకుత్‌పురా, లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, గుడిమల్కాపూర్, మెహదీపట్నం, కుత్బుల్లాపూర్ నియోజకవర్గవ్యాప్తంగా వాన పడుతోంది. భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నడుములోతు నీరు
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు బహదూర్‌పురా-కిషన్‌బాగ్ మార్గంలో నడుములోతు నీరు వచ్చి చేరింది. తాడు సహాయంతో ప్రజలు రహదారి దాటుతున్నారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై నిలిచిన నీటిని మ్యాన్ హోల్స్ ద్వారా పంపుతున్నారు. ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ పక్కన ప్రధాన రహదారిపై వరద నీరు వచ్చి చేరడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది మోటర్ల సాయంతో నీటిని ఎత్తిపోశారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. కేసీపీ కూడలి, మోడల్ హౌస్ వద్ద వరద నీరు రహదారి పైకి వచ్చి చేరడంతో మ్యాన్ హోళ్లను తొలగించి వరద నీటిని దిగువకు పంపించారు.