Cyclone ASANI: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు "అసని"గా నామకరణం చేశారు. గంటకు 16 కి.మీ వేగంతో కదులుతున్న అసని తుఫాను విశాఖపట్నంకు ఆగ్నేయంగా 970 కి.మీ దూరంలో ఉంది. ఒడిశా పూరీకి 1030 కి.మీ దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయువ్యదిశగా కదులుతున్న ఈ అసని తుఫాను రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారనుందని వెల్లడించారు.
మే 10న ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతంలో ఇది బలహీన పడే అవకాశం ఉందన్నారు. అసని ప్రభావంతో తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నేటి అర్థరాత్రి నుంచి గంటకు 105 నుంచి 125 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. తుఫాను ప్రభావంతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానున్నట్లు తెలిపారు.
10వ తేదీ సాయంత్రం నుంచి ఒడిశా తీరప్రాంతం, ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల మీదుగా అసని సాగనుంది. తుపాను ప్రభావంతో కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు మే 9, 10 తేదీల్లో బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఈదురుగాలుల బీభత్సానికి నలుగురి మృతి
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ఆదివారం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. పేటేరులో గాలుల ధాటికి పశువుల చావిడిలో రాతిగోడ మీద పడటంతో భూపతి రాహుల్ అంబేడ్కర్ (25) గాయాలపాలై మృతి చెందారు. నిజాంపట్నం మండలం కల్లిఫలం పంచాయతీ పరిధిలోని బొలగానివారిపాలెంలో పొలంలో తాడిచెట్టు విరిగి మీద పడటంతో గోపీనాథ్ (28) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన గ్రామ వాలంటీర్‌గా పని చేస్తున్నారు. రేపల్లె మండలం తుమ్మలకు చెందిన తుపాకుల సుబ్బారావుపై (65) తాడిచెట్టు పడటంతో మృతి చెందారు. కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లికి చెందిన కడలి రాంబాబుపై (57) గోడ కూలి మృతి చెందారు.
ఇవీ చదవండి :