Facebook Love Cheating: ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలేవైనా కావొచ్చు.. మోసగాళ్ల టార్గెట్ మాత్రం ఒక్కటే. అమాయకులు దొరికారా.. అందినాడికి దోచుకున్నామా.. ఆ తర్వాత ఖాతా క్లోజ్ చేశామా.. ఫోన్ స్విచాఫ్ చేశామా.. ఇదీ ప్రస్తుతం నెట్టింట్లో సాగుతున్న సైబర్ నేరాల దందా. ఇలాంటి నేరాలపై ప్రజలకు ఎంత అవగాహన కల్పించినా.. ఎక్కడో చోట సైబర్ క్రైమ్ బాధితులు మాత్రం వెలుగులోకి వస్తూనే ఉన్నారు. మోసపోయామని కొందరు పోలీసులను ఆశ్రయిస్తే.. మరికొందరు బయటకు చెప్పుకోలేక లోలోపలే మధనపడుతున్నారు. తాజాగా ఫేస్బుక్లో అమ్మాయి పేరుతో ఓ యువకుడిని మోసం చేసిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 2 లక్షల నగదు, చరవాణిని సైబర్ క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో నివాసం ఉంటున్న ఓ యువకుడికి ఫిబ్రవరి 2020లో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఇందుషా తుమ్మల అనే పేరుతో అందమైన ప్రొఫైల్ పిక్ కనిపించడంతో వెంటనే అంగీకరించాడు. తర్వాత కొన్ని నెలల పాటు ఫేస్బుక్ చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత యువకుడి ఫోన్ నెంబర్ తీసుకున్న ఇందుషా తుమ్మల.. క్రమంగా ఫోన్లోనూ మాట్లాడేది. తక్కువ సమయంలోనే వారి పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. చూస్తుండగానే.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి కూడా వచ్చేశారు.
ఇక అప్పటి నుంచి ఇందుషా తన ప్లాన్ అమలు చేసింది. పెళ్లి మైకంలో యువకుడిని ముంచేసిన ఇందుషా.. తన చదువుల కోసమని ఒకసారి... కరోనా బారిన పడ్డామని మరోసారి.. ఇలా విడతల వారీగా యువకుడి నుంచి రూ. 45 లక్షలు వసూలు చేసింది. ఇక చాల్లే అనుకుందో ఏమో..? ఆ తర్వాత ఫోన్ చేయడం మానేసింది. తన ఫియాన్సీ ఫోన్ కోసం ఎదురుచూసిన ఆ యువకుడు.. తిరిగి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ వచ్చింది. పెళ్లి మత్తు నుంచి తేరుకున్న యువకుడు.. మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.