వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా..వానాకాలంలో తటాకాలను తలపించే రహదారుల మరమ్మతులపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో అధ్యయనం నిర్వహించి 68 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సమస్యను పరిష్కరించేందుకు నడుం బిగించారు.
భాగ్యనగరం: 68 ప్రాంతాలు.. చినుకు పడితే తటాకాలు
కాసింత వర్షం పడితే చాలూ భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోతుంది.. రహదారులు తటాకాలను తలపిస్తుంటాయి.. రోడ్డెక్కితే ఏ రాత్రికి ఇంటికి చేరుతామో నగరవాసికే తెలియని పరిస్థితి. ఈ వర్షాకాలంలో అలాంటి తిప్పలు తలెత్తకుండా సాఫీగా ప్రయాణం సాగేలా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు.
భాగ్యనగరం: 68 ప్రాంతాలు.. చినుకు పడితే తటాకాలు
గతేడాది సుమారు గంటసేపు వర్షం కురిస్తేనే సైబరాబాద్ ఐటీ కారిడార్ అతలాకుతలమయ్యింది. ట్రాఫిక్ కష్టాలు పరాకాష్ఠకు చేరాయి. సైబర్ టవర్స్- మాదాపూర్ పోలీస్‌స్టేషన్ మార్గంలో రహదారి పూర్తిగా నీటితో జలమయమైపోయింది. మాదాపూర్ అయ్యప్పసొసైటీ వైపు ఉన్న ఇళ్ల మధ్యలోనుంచి వరద నీరంతా ప్రధాన రహదారి పైకే చేరింది. మిగిలిన ప్రాంతాల్లోనూ అదే సీన్ కనిపించింది. ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందుగానే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ‘‘ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశాం. ఐటీ కారిడార్‌పై ప్రత్యేక దృష్టి సారించాం. బల్దియా, సంబంధిత విభాగాల సమన్వయంతో సమస్యాత్మక ప్రాంతాల్లో నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నాం’ అని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ అన్నారు.
ఎక్కడెక్కడ..!
- గచ్చిబౌలీ ట్రాఫిక్ పీఎస్: ర్యాడిసన్ హోటల్, హర్ష టయోటా షోరూం కొత్తగూడ, హెరిటేజ్ జంక్షన్, బజాజ్ షోరూం, సంతోష్ దాబా అంజయ్య నగర్, విప్రో జంక్షన్, సబ్ స్టేషన్, హెచ్‌సీయూ ఆర్టీసీ డిపో, గచ్చిబౌలి జంక్షన్
- మియాపూర్ ట్రాఫిక్ పీఎస్: న్యూ కాలనీ(మియాపూర్), హెమా దుర్గ గుడి, ఖజానా జ్యూవెల్లర్స్, లింగంపల్లి ఆర్‌యూబీ, హాఫీజ్‌పేట్ పైవంతెన ముగింపు, పతంజలి స్టోర్(హాఫీజ్‌పేట్)
- బాలానగర్ ట్రాఫిక్ పీఎస్: పాలాక్ హోటల్(ఎర్రగడ్డ మెట్రో స్టేషన్), ఎఫ్‌సీఐ గోదాం ఎదురుగా(సనత్‌నగర్), నర్సాపూర్ ఎక్స్ రోడ్డు, బాలానగర్ టీ జంక్షన్
- అల్వాల్ ట్రాఫిక్ పీఎస్: మంగాపూర్ కాలనీ(ఓల్డ్ అల్వాల్ రోడ్డు), ఓల్డ్ అల్వాల్ జంక్షన్, అంబేడ్కర్ విగ్రహం నుంచి గోల్నాకా ఈ-సేవ రోడ్డు, గాంధీ విగ్రహం(జీడిమెట్ల జంక్షన్)
- జీడిమెట్ల ట్రాఫిక్ పీఎస్: భగీరథ కళాశాల రోడ్డు(కుత్బుల్లాపూర్), గణేష్‌నగర్ బస్టాప్, షా థియేటర్ ఎదురుగా, షాపూర్‌నగర్ రైతుబజార్, జీడిమెట్ల బస్సు డిపో, సాయిబాబా గుడి రోడ్డు(సురారం), సాయి పూజ థియేటర్
- కూకట్‌పల్లి ట్రాఫిక్ పీఎస్: ప్రశాంత్‌నగర్ బస్టాండ్, శివానంద రిహబిలిటేషన్ హోం, కేపీహెచ్ ఫేజ్ 4 మసీదు, ఆర్వోబీ పక్కన శ్మశానవాటిక, ఇందూ రెండో గేట్(కేపీహెచ్‌బీ), అంకుర ఆసుపత్రి ఎదురుగా, మంజీరా మెజిస్టిక్ మాల్, హోలిస్టిక్ ఆసుపత్రి, క్రోమా స్టోర్, హైదర్‌నగర్ బస్టాండ్, ఐడీపీఎల్ కాలనీ ప్రవేశద్వారం, నిజాంపేట్ జంక్షన్, భాజపా కార్యాలయం, మూసాపేట్ మెట్రోస్టేషన్, వై జంక్షన్
- రాజేంద్రనగర్ ట్రాఫిక్ పీఎస్: రాందేవ్ బాబా మందిరం, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్లు 193, 265, 307
- ఆర్జీఐ విమానాశ్రయం ట్రాఫిక్ పీఎస్: బ్రిలియంట్ గ్రామర్ పాఠశాల, ప్రియాంక గ్యాస్ ఏజెన్సీ(రాళ్లగూడ), రైల్వే వంతెన కింద(శంషాబాద్), సవేరా హోటల్ ఎదురుగా, తొండుపల్లి టోల్ గేట్ ప్రవేశద్వారం, కిషన్‌గూడ పైవంతెన.
ఇది చదవండిఇవాళ సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ