తెలంగాణలోని భద్రాద్రి జిల్లా పరిశ్రమలకు నెలవు. కేటీపీఎస్, సింగరేణి, రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు మోసగాళ్లు నమ్మబలకడంతో ఇటీవల కాలంలో పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు ఒక్కొక్కరూ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించారు. కొన్నాళ్లకు మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. ఉద్యోగం ఏదైనా విద్యార్హతలు, ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగానే లభిస్తాయని నిరుద్యోగ యువత గుర్తెరగాలి. ‘ఎంపిక కమిటీల్లో మావాళ్లు ఉన్నారనే’ చెప్పే కట్టు కథలు.. తల్లిదండ్రులు కష్టపడి కూడబెట్టిన సొమ్మును కోల్పోయేలా చేస్తాయి.
మీ ఆశే.. వారికి అవకాశం
ఎలాంటి ఆన్‌లైన్ పోటీల్లో పాల్గొనలేదు. ఎక్కడా దరఖాస్తు చేయలేదు. అయినా ‘మీరు రూ.లక్షలు, రూ.కోట్లు గెలుచుకున్నారని’ చరవాణులకు సందేశాలొస్తున్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్ధు నమ్మారో.. అంతే సంగతులు? కొత్తగూడెంకు చెందిన ఓ యువకునికి ‘అమెరికాలో ఉద్యోగం’ వచ్చిందని ఓ ఈ-మెయిల్ వచ్చింది. అది నమ్మి రూ.10 లక్షల వరకు ఫీజుల పేరుతో చెల్లించాడు. ఖమ్మం జిల్లాలోనూ ఓ వ్యాపారికి లాటరీలో కారు తగిలిందని నమ్మించి రూ.లక్షలు దండుకున్నారు. ఇలాంటి సందేశాలతో అప్రమత్తమై, ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించడం మేలు.
ఏటీఎం మోసాలు
రైతులు, డ్వాక్రా మహిళలు, పింఛనుదారులు, చిరువ్యాపారులు, విశ్రాంత ఉద్యోగులు.. ఎవరైనా సరే తమ నగదు విత్ డ్రాకు ఏటీఎంల పైనే ఆధారపడుతున్నారు. ఇదే కేటుగాళ్లకు అవకాశంగా మారింది. పాల్వంచకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి స్థానిక ఏటీఎంకు పింఛను డబ్బుల కోసం వెళ్లగా.. అక్కడే ఉన్న ఓ మోసగాడు అతని కార్డును మార్చి రూ.50 వేల నగదు తస్కరించాడు. బాధితుడు చేసిన తప్పల్లా ‘వ్యక్తిగత పిన్’ నంబరును నమ్మి చెప్పడమే. ఇలాంటి ఉదంతాలతో పాటు కాల పరిమితి ముగిసిన డెబిట్, క్రెడిట్ కార్డుల బదులు కొత్తవి పంపుతామని ఈ మధ్య ఫేక్ కాల్స్ బాగా వస్తున్నాయని పోలీసుల పరిశీలనలో తేలింది. వ్యక్తిగత వివరాలు చెబితే మోసపోవడం పక్కా.