Cyber Frauds: సైబర్ కేటుగాళ్లు రోజుకో తరహాలో రూటుమార్చి ఏమార్చుతున్నారు. ఈ మధ్య ఏకంగా బ్యాంకులకే కన్నం వేస్తున్నారు. ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సర్వర్ నుంచి ఒక్క రోజులోనే 12కోట్లు లూటీ చేశారు. బ్యాంకుకు చెందిన మూడు శాఖల్లోని మూడు వేర్వేరు ఖాతాల నుంచి నగదును దాదాపు 120 ఖాతాలకు మళ్లించినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఆదివారం సెలవు కావడం వల్ల అధికారులు సోమవారం వచ్చి లెక్క చూసేసరికి 12కోట్లు తేడా వచ్చింది. బ్యాంకు ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగినట్లు గుర్తించిన అధికారులు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.సర్వర్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి బ్యాంకుకు సంబంధించిన 12కోట్లు ఇతర ఖాతాల్లో జమ చేసినట్లు మహేశ్ బ్యాంకు ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
- సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
సిబ్బంది మెయిల్ తెరిచి చూడగానే..
గతేడాది జులైలోనూ సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఇదే తరహాలో సర్వర్‌లోకి చొరబడి రెండు కోట్లు కొల్లగొట్టారు. అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు శేరిలింగంపల్లికి చెందిన ఇద్దరు సోదరులను అరెస్ట్ చేశారు. వీళ్ల ఖాతాలో 2లక్షల నగదు జమ కాగా... 20వేలు ఉంచుకుని మిగతా మొత్తాన్ని టోలీచౌకీలో ఉండే ఆఫ్రికన్ జాతీయుడికి ఇచ్చేసినట్లు నిందితులు తెలిపారు. సైబర్ నేరగాళ్లు రిమోట్ యాక్సెస్ టూల్ అనే అప్లికేషన్‌ను ప్రయోగించి బ్యాంకు సర్వర్‌ను హ్యాక్ చేస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. బ్యాంకులో పనిచేసే సిబ్బందికి ఈ-మెయిల్ ద్వారా రిమోట్ యాక్సెస్ టూల్‌ను పంపిస్తున్నారు. సిబ్బంది మెయిల్ తెరిచి చూడగానే కంప్యూటర్ సిస్టం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. సర్వర్ నుంచి ఖాతాలోకి నగదు బదిలీ చేసుకొని.. ఆ మొత్తాన్ని ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. స్థానికుల సాయంతో సదరు బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి మోసాలకు పాల్పడుతున్నారు