ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇష్టానుసారం సీటీ స్కాన్‌ వద్దు - CT Scan For COVID-19 Patients

కొవిడ్ చికిత్సలో సీటీస్కాన్ పాత్ర ముఖ్యమైనది. కరోనా లక్షణాలు కనిపించిన ఒకట్రెండు రోజుల్లోనే సీటీ స్కాన్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. జాప్యం చేస్తే ప్రమాదమంటున్నారు. బాధితుడి లక్షణాలు బట్టి...ఎవరికి అవసరమో వైద్యులే నిర్ణయించాలి. ఆలా కాకుండా ఇష్టానుసారం సీటీ స్కాన్ చేయించుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

CT scan
CT scan

By

Published : May 10, 2021, 8:14 AM IST

ఓ ప్రైవేటు కార్యాలయంలోని ఉద్యోగికి కొవిడ్‌ సోకింది. అతని సహచరునికి స్వల్పంగా జలుబు ఉంది. ఇతర లక్షణాలు లేకపోయినా పరీక్షలు చేయించుకోవాలనుకున్నాడు. ఆర్‌టీ పీసీఆర్‌కు నమూనాలిస్తే 2-3 రోజులు పడుతుందని.. తనంతట తానుగా అదే రోజు సీటీ స్కాన్‌ చేయించుకున్నాడు. అందులో కొవిడ్‌ ఉన్నట్లుగా నిర్ధారణ కాలేదు. దీంతో సాధారణంగానే విధులకు హాజరవుతున్నాడు. రెండు రోజుల అనంతరం జ్వరం వచ్చింది. వారం రోజులుగా మందులు వాడుతున్నా తగ్గకపోగా పెరిగింది. అదనంగా దగ్గు కూడా వస్తోంది. ఈ సారి వైద్యుని సలహా మేరకు మళ్లీ సీటీ స్కాన్‌ చేయించాడు. అందులో కొవిడ్‌ నిర్ధారణ కావడంతో పాటు ఊపిరితిత్తుల సమస్యా మొదలైనట్లు వైద్యుడు గుర్తించారు. అత్యవసరంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సి వచ్చింది.

కొవిడ్‌ చికిత్సలో సీటీ స్కాన్‌ పాత్ర చాలా కీలకం. దీన్ని ఎలా వినియోగించుకుంటామనేది అత్యంత ప్రాధాన్య అంశం. కొవిడ్‌ తొలిదశలోనే అంటే లక్షణాలు కనిపించిన ఒకట్రెండు రోజుల్లోనే సీటీ స్కాన్‌ చేయించినా.. దాని వల్ల ఫలితం నిరుపయోగం. అంత ముందస్తుగా స్కానింగ్‌లో వైరస్‌ ప్రభావాన్ని నిర్ధారించడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో కొద్దిగా ఆలస్యం చేసినా.. కొవిడ్‌ ఉద్ధృతి పెరిగిపోయి, పరిస్థితి ప్రాణాంతకంగా మారే ప్రమాదమూ ఉంది. ఈ రెండింటినీ కచ్చితంగా బేరీజు వేయాల్సింది వైద్యులే. బాధితుడి లక్షణాల తీవ్రతను బట్టి ఎవరు ఎప్పుడు సీటీ స్కాన్‌ చేయించుకోవాలనేది వైద్యనిపుణులు మాత్రమే సూచించాల్సిన అంశం. అలా కాకుండా ఎవరికివారే తొందరపడినా.. అవసరమైన సందర్భాల్లో జాప్యం చేసినా.. కొవిడ్‌ తీవ్రతకు గురి కావాల్సి వస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటివి నివారించడంలో సీటీ స్కాన్‌ ఎంత మేరకు ఉపయోగపడుతుంది? అసలు దీనివల్ల ఏం తెలుస్తుంది? కొవిడ్‌ చికిత్సలో సీటీ స్కాన్‌కున్న ప్రాధాన్యమేమిటి? తదితర అంశాలపై ప్రత్యేక కథనం.

ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షే ప్రామాణికం

రెండోదశలో కొవిడ్‌ ఉధ్ధృతిని వైద్యులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. తొలిదశలో కంటే అతివేగంగా, తీవ్రంగా విరుచుకుపడుతోంది. మొదటిదశలో ఊపిరితిత్తులపై కరోనా వైరస్‌ దుష్ప్రభావాన్ని తెలుసుకోవడానికి లక్షణాలు కనిపించిన 7-10 రోజుల్లో అవసరమైతే సీటీ స్కాన్‌ తీయించాల్సి వచ్చేది. రెండోదశలో వైరస్‌ అంత సమయం ఇవ్వడం లేదు. కొందరిలో 5-7 రోజుల్లోనే తీవ్రత పెరిగిపోతోంది. దీన్ని అంచనా వేయడంలో ఏ మాత్రం అటూఇటూ అయినా.. యుక్తవయస్కులు కూడా ఉన్నట్టుండి కుప్పకూలే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందుకే ప్రతి నిర్ధారణ పరీక్ష కూడా కొవిడ్‌లో కీలకంగా మారుతుంది. అయితే సీటీ స్కాన్‌ను నిర్ధారణ పరీక్షగా పరిగణనలోకి తీసుకోవద్దనీ, ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షే కొవిడ్‌ నిర్ధారణలో ప్రామాణికమని ప్రపంచ ఆరోగ్య సంస్థ, సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) కూడా స్పష్టం చేశాయి. కేవలం తప్పనిసరి పరిస్థితుల్లో, అతి ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే సీటీ స్కాన్‌ను ఆయుధంగా వినియోగించుకోవాలని తేల్చిచెప్పాయి.

ఎవరిలో అవసరం?

* కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన ప్రతి ఒక్కరికి సీటీ స్కాన్‌ చేయాల్సిన అవసరం లేదు.
* కొన్నిసార్లు వైరస్‌ రకాల్లో మార్పుల కారణంగా ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలో కొవిడ్‌ను గుర్తించడం సాధ్యం కాదు. ఇలాంటప్పుడు బాధితుడిలో లక్షణాలు కనిపిస్తున్నా.. ఆర్‌టీ పీసీఆర్‌ నెగెటివ్‌గా రావచ్చు.
* జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలుండి, ఆర్‌టీ పీసీఆర్‌ నెగెటివ్‌గా ఉన్నవారికి సీటీ స్కాన్‌ ద్వారా నిర్ధారణ అవసరం.
* పాజిటివ్‌గా తేలిన వ్యక్తి చికిత్స పొందుతున్న క్రమంలోనూ స్కాన్‌ చేయించాల్సి రావచ్చు. ఉదాహరణకు.. 5 రోజులు గడిచినా కూడా జ్వరం 101 డిగ్రీలకు పైగా నమోదవడం, దగ్గు పెరిగిపోతుండడం, ఆయాసం ఎక్కువవడం, రక్తంలో ఆక్సిజన్‌ శాతం 92 కంటే తక్కువకు పడిపోతుండడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే.. సీటీ స్కాన్‌ చేయించి ఊపిరితిత్తులను పరీక్షించడం అవసరం.

స్కానింగ్‌లో ఏం తెలుస్తుంది?

కరోనా వైరస్‌ వల్ల గుండె, మెదడు, రక్తనాళాలు.. ఇలా అనేక అవయవాలపై దుష్ప్రభావం పడినా.. ప్రధానంగా తీవ్రంగా దెబ్బతినేవి ఊపిరితిత్తులు. రోగులు కూడా ఎక్కువగా శ్వాసకోశ సమస్యలతోనే వస్తుంటారు. కొవిడ్‌ బాధితుల శ్వాసకోశాల్లో చాలా స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. సాధారణంగా తొలిదశలో ఎక్స్‌రేలో కనిపించని మార్పులు కూడా సీటీ స్కాన్‌లో కనిపిస్తాయి. వ్యాధిని త్వరగా గుర్తించడం ద్వారా మరింత ముదరకుండా సరైన వైద్యం అందించడానికి ఈ స్కాన్‌ దోహదపడుతుంది. వ్యాధి తీవ్రత ఎంత ఉందనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో స్వల్పం, మధ్యస్థం, తీవ్రం.. ఇలా మూడు రకాలుగా వ్యాధిని అంచనా వేస్తారు. దీన్నిబట్టి చికిత్సను అందించడానికి వీలవుతుంది.

అనవసరంగా చేయించొద్దు

కరోనా చికిత్సలో సీటీ స్కాన్‌ పాత్ర పరిమితమే. తీవ్రతను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. వైద్యుల సూచనలు లేకుండా సీటీ స్కాన్‌ చేయించొద్దు. ముఖ్యంగా లక్షణాలు కనిపించిన తొలిదశలో అస్సలు అవసరం లేదు. ఒకవేళ చికిత్స పొందుతున్నా జ్వరం హెచ్చుగా వస్తుంటే అప్పుడు 7 రోజుల తర్వాత సీటీ స్కాన్‌ చేయించాలి. అయితే కొన్నిసార్లు ఇతర అనుబంధ లక్షణాలు కూడా తీవ్రంగా ఉన్నప్పుడు 5-7 రోజుల్లోనూ స్కానింగ్‌ చేయించాల్సి వస్తోంది. స్కాన్‌ ఎప్పుడు చేయించాలనేది రోగి అనారోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అనవసరంగా స్కాన్‌ చేయించడం వల్ల డబ్బులు వృథాతో పాటు భవిష్యత్‌లోనూ కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణుల్లో స్కాన్‌ చేయించకూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో చేయించాల్సి వచ్చినా.. వైద్యుని సలహా తప్పనిసరి.

- డాక్టర్‌ తూడి పవన్‌రెడ్డి జనరల్‌ ఫిజీషియన్‌, సన్‌షైన్‌ ఆసుపత్రి

తీవ్ర లక్షణాలను బట్టి 4-6 రోజులకే

ఆర్‌టీ పీసీఆర్‌ నెగెటివ్‌ ఉందని చెప్పి, బాధితుడికి చికిత్స ఇవ్వకుండా వదిలేస్తే.. జబ్బు ముదిరి ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. ఇటువంటప్పుడు సీటీ స్కాన్‌ ద్వారా నిర్ధారణ చేసుకొని అవసరమైన చికిత్స అందించాలి. కొందరు కంగారుపడి సొంతంగా స్కాన్‌ తీయించుకుంటారు. మరికొందరు వైద్యులు సొమ్ము చేసుకోవాలనే దుర్బుద్ధితోనూ సీటీ స్కాన్‌లను తీయిస్తుంటారు. ఇవి రెండూ సరైన విధానాలు కావు. రెండోదశలో తీవ్ర లక్షణాలను బట్టి 4-6 రోజుల్లోపే తీయించాల్సి వస్తోంది. చికిత్స కొనసాగుతున్న క్రమంలోనూ బాధితుడి ఆరోగ్యం మరింత క్షీణిస్తుంటే.. ఊపిరితిత్తులపై తీవ్రతను అంచనా వేయడానికి మళ్లీ స్కాన్‌ చేయించాలి. సీటీ స్కాన్‌ ఫలితాల్లో ‘కొరాడ్స్‌’ ఎంత ఉందనేది కేవలం నిర్ధారణకే పరిమితమైంది. సీటీ ‘సివియారిటీ స్కోర్‌’ మాత్రం ఊపిరితిత్తుల్లో వైరస్‌ తీవ్రతను చెబుతుంది. ఎంత భాగం దుష్ప్రభావానికి గురైందనేది మచ్చలను బట్టి చెబుతారు. దీన్ని బట్టి చికిత్స ఆసుపత్రిలోనా.. ఇంటి వద్ద ఉంచి అందించాలా? అనేది తెలుస్తుంది. -డాక్టర్‌ సుసర్ల రామ్మూర్తి, విశ్రాంత ఆచార్యులు రేడియాలజీ విభాగం, డీన్‌, నిమ్స్‌

ఇదీ చదవండి

కొవిడ్ బాధితులకు టీకానే రక్ష

ABOUT THE AUTHOR

...view details