CS Press meet: ‘పీఆర్సీ అమలులో జాప్యం అవుతుండటంతో మధ్యంతర భృతి ఇచ్చారు. దీనికింద రూ.17 వేల కోట్లు చెల్లించాం. ఇది జీతంలో భాగంకాదని అప్పట్లో ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉంది. రాష్ట్ర రాబడిపై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. అన్నింటిపై సీఎంతో చర్చించాకే ఉత్తర్వులు వెలువడ్డాయి. కరవు భత్యం తగ్గింపుతో ఎవరి స్థూల (గ్రాస్) జీతం తగ్గడంలేదు. పది రోజులు ఆగితే పే స్లిప్స్ వస్తాయి. గతనెల, ఈనెల ప్లే స్లిప్స్ పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ వివరించారు. బుధవారం సచివాలయంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆయా వివరాలను వెల్లడించారు. సీఎస్ సమీర్‌శర్మ మాట్లాడుతూ.. ‘2008-09 పీఆర్సీ సమయంలో నేను ఆర్థిక కార్యదర్శిగా ఉన్నాను. అప్పటికి, ఇప్పటికి పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉంది. రాష్ట్ర రాబడి ప్రస్తుతం రూ.62 వేల కోట్లు ఉంది. కొవిడ్ లేకపోతే అది రూ.98 వేల కోట్ల వరకు ఉండేది. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానూ రాబడిపై ప్రభావం కనిపిస్తోంది. అయినా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. పీఆర్సీ అమలులో కొన్ని పెంపు, తగ్గింపులు సహజమే. కేంద్ర పీఆర్సీ అమలుతో మరింత మేలు కలుగుతుంది. త్వరలో ఒకే దేశం, ఒకే పీఆర్సీ అవుతుంది. 60 ఏళ్లలో కూడా ఉద్యోగులు పనిచేసేందుకు ఫిట్‌గా ఉన్నారు. వీరితో మరో రెండేళ్లు పనిచేయించేందుకే పదవీ విరమణ వయసు పెంచాం. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గవు. ఉద్యోగుల సూచనలు ఒక్కటీ పరిగణించలేదనేది నిజం కాదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో పలుదఫాలు చర్చించి, అధికారుల కమిటీ ఇచ్చిన సిఫార్సులపై చివరగా సీఎం నిర్ణయం తీసుకున్నాకే ఉత్తర్వులు ఇచ్చాం. ఏంజరిగినా కుటుంబ పెద్దమీదే నిందలు వస్తాయి. ఇవి ఊహించినవే. ఉద్యోగ సంఘాలతో సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు సమ్మెకు వెళ్తామన్నారనేది తెలియదు. లిఖిత పూర్వంగా ఎవరూ ఇవ్వలేదు’ అని తెలిపారు.
పీఆర్సీతో న్యాయం జరిగింది: రావత్
‘పీఆర్సీతో ఉద్యోగులు, పింఛన్‌దార్లకు న్యాయం జరిగిందని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
* 2021-22 ప్రకారం రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1,70,215 ఉంది. ఇది దక్షిణాది రాష్ట్రాలు అన్నింటికంటే తక్కువ. రెవెన్యూ లోటు రూ.34,927 కోట్లు, ద్రవ్యలోటు రూ.54,370 కోట్లు ఉంది.
* పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ఏటా సగటున 15% పెరగాలి. ఈ లెక్కన 2019-20లో రూ.71,844 కోట్లకుగాను రూ.60,933 కోట్లు, 2020-21లో రూ.82,620 కోట్లుకుగాను రూ.60,688 కోట్లే రాబడి వచ్చింది.
* ఈ ప్రభుత్వం వచ్చిన నెలకే ఉద్యోగులు, పింఛనర్లకు మధ్యంతర భృతి ఇవ్వడం ద్వారా రూ.17,918 కోట్లు చెల్లించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు, యానిమేటర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పర్యవేక్షకులు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, సామాజిక ఆరోగ్య కార్యకర్తల గౌరవ వేతనం పెంపు, హోంగార్డుల రోజువారీ డ్యూటీ అలవెన్స్ పెంపు అమలు చేశారు.
* కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాల అమలు, ఆర్టీసీ విలీనం, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకం, వైద్య రంగంలో నియామకాలు, ఆప్కాస్ ద్వారా ఆయా ఉద్యోగులకు మేలు కల్పించారని రావత్ వివరించారు.