జాతీయ రహదారులపై నడిచి వెళుతున్న వలస కూలీలను శిబిరాల్లో పెట్టి వారికి ఆహారం, ఇతర వసతులు కల్పించిన తదుపరి వారిని వారి స్వస్థలాలకు చేర్చేందుకు కలెక్టర్లు చేసిన కృషిని సీఎస్ నీలం సాహ్ని ప్రత్యేకంగా కొనియాడారు. కరోనా వ్యాప్తి నిరోధానికి సంబంధించి ప్రజల్లో 10 అంశాల్లో విస్తృత అవగాహన తేవాలన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయాలి: సీఎస్
ఈ నెలాఖరు వరకు లాక్డౌన్ను పొడిగించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు అవసమైన చర్యలు చేపట్టాల్సిందిగా సూచనలు జారీ చేశారు. అధిక సంఖ్యలో టెస్టులకు నిర్వహించి పాజిటివ్ కేసులను గుర్తించి వారికి తగిన వైద్య సేవలు అందించాలని చెప్పారు.
కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించడం.. ఇంట్లోనే ఉండేలా ప్రోత్సహించడం, జిల్లా కొవిడ్ ఆసుపత్రుల గురించి ప్రజలందరికీ విస్తృతంగా ప్రచారం చేసి తెలియజేయాలని అధికారులకు సీఎస్ సూచించారు. అంతేగాక 65 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు, పదేళ్లలోపు వయస్సు గల చిన్నారులు ఇళ్లలోనే ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. పబ్లిక్ ప్రాంతాల్లోనూ, వర్కింగ్ ప్లేసుల్లో పాన్, గుట్కా, పొగాకు నమిలి ఉమ్మి వేయడం నిషేధమని అలా చేస్తే శిక్షార్హులవుతారనే అవగాహన ప్రజల్లో తేవాలన్నారు. పబ్లిక్, ప్రైవేట్ రవాణా విషయంలో భౌతిక దూరాన్ని పాటించేలా చూడడం కూడా ముఖ్యమని సీఎస్ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయం..ఎప్పుడంటే..!