తుపానుతో నష్టపోయిన రైతుకు అందాల్సిన పంటల బీమా పరిహారాన్ని కొంతమంది అక్రమార్కులు తమ జేబుల్లో వేసుకున్నారు. వర్షాలతో నష్టం జరిగినట్లు పొలాల వివరాలను దస్త్రాల్లో చూపించారు. కాని భూ యజమాని స్థానంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారి ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను జత చేశారు. చివరకు పంట బీమా పరిహారాన్ని దర్జాగా దోచేశారు. రేపల్లె ప్రాంతంలో బీమా పరిహారం అక్రమార్కుల ఖాతాల్లోకి వెళ్లిందని కొంతమంది గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడంతో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అక్రమార్కుల వ్యవహారాలు పూర్తిగా బయటకొస్తాయి.
నివర్ తుపాను ప్రభావంతో గతేడాది నవంబరు నాలుగో వారంలో కురిసిన భారీ వర్షాలకు వేల ఎకరాల్లో వరి పంట నీటమునిగి దెబ్బతింది. రోజుల తరబడి పొలంలోనే నీరు నిలిచిపోవడంతో కంకులు కుళ్లి పోయాయి. మొలకలు వచ్చి ధాన్యం పూర్తిగా రంగుమారింది. పంట కోత ప్రయోగాల ఆధారంగా పంట నష్టం అంచనా వేశారు. రేపల్లె మండలంలో 3823 మంది, నిజాంపట్నంలో 3049 మంది, నగరంలో 3319, చెరుకుపల్లిలో 3911 మంది రైతులు నష్టపోయినట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. రేపల్లె రూ.2.28 కోట్లు, నిజాంపట్నం రూ.6.70 కోట్లు, నగరం రూ.5.66 కోట్లు, చెరుకుపల్లి మండలానికి రూ.2.57 కోట్ల చొప్పున బీమా నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే రైతులకు దక్కాల్సిన పంట నష్టపరిహారం పక్కదారి పట్టింది. కాకుమాను, వట్టిచెరుకూరు, చేబ్రోలు మండలాల్లోని ముట్లూరు, కోయిలమూడి, కొల్లిమర్ల, కారంపూడిపాడు, పాతరెడ్డిపాలెం గ్రామాల్లో సెంటు భూమి సైతం లేని ఖాతాలకు పరిహారం జమ అయింది. రైతులు కాని వారు బ్యాంకుల నుంచి పంట నష్టపరిహారం నగదు డ్రా చేసుకోవడాన్ని అక్కడి వారు గుర్తించారు. ఇప్పటి వరకు కారంపూడిపాడులో 80 మంది, ముట్లూరు, కొల్లిమర్ల, గుండవరంలో 20 మంది చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయినట్లు గుర్తించారు. రైతులు కాని వారి ఖాతాల్లోకి నగదు జమ కావడంపై కొందరు పంట నష్ట పరిహారం పంపిణీలో అవకతవకలు జరిగినట్లు ఇటీవల జిల్లా గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రూ.లక్షల ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. తీర ప్రాంతానికి చెందిన వ్యవసాయశాఖ అధికారులతో కలిసి ఇతర ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు ఈ నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆశలు అడియాసలయ్యాయి.. : కొంతమంది వ్యవసాయ సిబ్బంది స్వార్థానికి రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి మండలాలకు చెందిన అన్నదాతలు పరిహారానికి దూరమయ్యారు. నీటమునిగి దెబ్బతిన్న పంట వివరాలు అధికారులు నమోదు చేసుకోవడంతో బీమా పరిహారం అందుతుందని ఎదురుచూస్తున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన బీమా సొమ్మును కొందరు అనర్హులు పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీమా నిధులు పక్కదోవ పట్టించడంలో కీలకపాత్ర పోషించిన వ్యవసాయ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.