కృష్ణా, గోదావరి వరదలు, భారీ వర్షాల కారణంగా మొత్తం 3,70,055 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్దారణకు వచ్చింది. 1,73,928 ఎకరాల్లో వరి పంటకు నష్టం కలిగిందని అంచనా వేశారు. 77,500 ఎకరాల్లో పత్తి పంట నష్టం జరిగినట్టు నివేదికలో పేర్కొన్నారు. మొక్కజొన్న పంటకు సంబంధించి 48 వేల 888 ఎకరాల మేర నష్టం వాటిల్లింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,29, 442 ఎకరాల్లో పంట నష్ట పోయినట్టు అంచనాలు రూపొందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సాధారణం కంటే ఎక్కువగా 691 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసిందని ప్రభుత్వం పేర్కొంది. ఒక్క శ్రీకాకుళం జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా 26 శాతం మేర అధిక వర్షం కురిసింది.