ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ వెబ్‌సైట్లలో సమాచారం అరకొరే! - governament website

ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, నిధుల వినియోగం, రుణాలు, రాయితీలు, జీవోలు... ఇలాంటి వాటిపై అధికారిక, తాజా సమాచారం కోసం ప్రజలు ప్రభుత్వ వెబ్‌సైట్లను విశ్వసిస్తారు. ఇంతటి ప్రాధాన్యమున్న మన రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్లు మాత్రం కొన్నిరోజులుగా అసమగ్ర సమాచారంతో దర్శనమిస్తున్నాయి. సర్కారు జీవోలన్నీ జీఓఐఆర్‌ వెబ్‌సైట్‌లో ఉంచే విధానం 2008 నుంచీ అమల్లో ఉండేది. దీన్ని ఇప్పుడు పూర్తిగా నిలిపేశారు. ఒకటీ అరా జీవోలను మాత్రమే ప్రభుత్వ ఈగెజిట్‌లో ఉంచుతున్నారు.

ప్రభుత్వ వెబ్‌సైట్లలో సమాచారం అరకొరే!
ప్రభుత్వ వెబ్‌సైట్లలో సమాచారం అరకొరే!

By

Published : Nov 9, 2021, 4:54 AM IST

ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, నిధుల వినియోగం, రుణాలు, రాయితీలు, జీవోలు... ఇలాంటి వాటిపై అధికారిక, తాజా సమాచారం కోసం ప్రజలు ప్రభుత్వ వెబ్‌సైట్లను విశ్వసిస్తారు. ఇంతటి ప్రాధాన్యమున్న మన రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్లు మాత్రం కొన్నిరోజులుగా అసమగ్ర సమాచారంతో దర్శనమిస్తున్నాయి. సర్కారు జీవోలన్నీ జీఓఐఆర్‌ వెబ్‌సైట్‌లో ఉంచే విధానం 2008 నుంచీ అమల్లో ఉండేది. దీన్ని ఇప్పుడు పూర్తిగా నిలిపేశారు. ఒకటీ అరా జీవోలను మాత్రమే ప్రభుత్వ ఈగెజిట్‌లో ఉంచుతున్నారు. వివిధ శాఖల వెబ్‌సైట్లలో సైతం ప్రజలకు ఉపయోగపడే సమాచారం కనిపించడం లేదు. ఒకప్పుడు ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన ‘సీఎం కోర్‌ డ్యాష్‌బోర్డు’కు సైతం గ్రహణం పట్టింది. అప్పట్లో ముఖ్యమంత్రి నుంచి సామాన్యుడి వరకు వివిధ ప్రభుత్వ శాఖల సమగ్ర సమాచారాన్ని ఒక్క క్లిక్‌తో తెలుసుకునేందుకు వీలుండేది. ఇప్పుడు కోర్‌ డ్యాష్‌బోర్డు పేరుకు మాత్రమే ఉంది. దానిలో అరకొర సమాచారాన్నే అప్‌డేట్‌ చేస్తున్నారు. చాలా ప్రభుత్వశాఖల సమాచారం దీనిలో దొరకడం లేదు.

ధాన్యం సేకరణపైనా గోప్యత

* పౌర సరఫరాల శాఖ వెబ్‌సైట్‌లో ఖరీఫ్‌, రబీ సీజన్లు, జిల్లాల వారీగా ఎక్కడ ఎంత ధాన్యం కొన్నారు? ఇంకా ఎంతమంది రైతులకు బకాయిలు చెల్లించాలనే వివరాలన్నీ ఇదివరకు ఉండేవి. ఇప్పుడా వివరాలను తీసేశారు. ధాన్యం అమ్మిన రైతు తన ఎఫ్‌ఓటీ నంబరు ఎంటర్‌ చేస్తే ఆయనకు సంబంధించిన వివరాలు మాత్రమే తెలుస్తాయి. మొత్తం బకాయిల గురించి అందరికీ తెలియాల్సిన అవసరం లేదన్న భావనతోనే ఇలా చేశారనే విమర్శలున్నాయి. అధికారులు మాత్రం సర్వర్‌పై భారం తగ్గించేందుకే ఈ వివరాలను పెట్టడం లేదని చెబుతున్నారు.

* ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘నాడు-నేడు’ కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ ప్రారంభించింది. ఇదివరకు నాడు-నేడులో జరుగుతున్న పనులను తొమ్మిది రకాలుగా వర్గీకరించి, ప్రతి పని పురోగతిని వెబ్‌సైట్‌లో ఉంచేవారు. ఎన్ని బెంచీలు సరఫరా చేశారు? ఎన్ని భవనాలకు రంగులేశారు? ఇంగ్లిషు ల్యాబ్‌లు ఎన్ని పూర్తయ్యాయి? వంటి వివరాలన్నీ ఉంచేవారు. ఇప్పుడా కేటగిరీని తీసేశారు.

* రాష్ట్రంలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టుల పనుల పురోగతిని ఇదివరకు వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసేవారు. ఏ ప్రాజెక్టు పనులు ఎంతవరకు జరిగాయి? ఎప్పటిలోగా పూర్తి చేయాలి? లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నాం? నిధులెన్ని ఖర్చయ్యాయి? వంటి వివరాలన్నీ పొందుపరిచేవారు. ఇప్పుడు వీటినీ వెబ్‌సైట్‌లో ఇవ్వడం లేదు.

నరేగా వివరాలూ లేవు

* పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ వెబ్‌సైట్‌లో.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) అమలు వివరాలు ప్రజలందరికీ తెలిసేలా గతంలో ప్రత్యేక డ్యాష్‌బోర్డు ఉండేది. ఇప్పుడు సంబంధిత అధికారులకు మాత్రమే తెలిసేలా ఉంచుతున్నారు.

* పురపాలక శాఖ పరిధిలో జరిగే కార్యక్రమాల విస్తృత సమాచారం గతంలో వెబ్‌సైట్‌లో ఉండేది. ఇప్పుడు ముఖ్య సమాచారమేదీ వెబ్‌సైట్‌లో పెట్టడం లేదు. అధికారులకు మాత్రమే సమాచారం అందుబాటులో ఉంచుతున్నారు.

* ఉద్యానశాఖ, మత్స్యశాఖ వెబ్‌సైట్లలో రెండేళ్ల నాటి వివరాలే ఉన్నాయి.

* ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి గతంలో ఆర్‌వైఎస్‌ఎస్‌ వెబ్‌సైట్‌ ఉండగా, దాన్ని ఏపీసీఎన్‌ఎఫ్‌ (కమ్యూనిటీ మేనేజ్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌)గా మార్చారు. కానీ దానిలో రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు? ఎలాంటి పంటలు పండిస్తున్నారు వంటి వివరాలేమీ లేవు.

ఇదీ చదవండి:

ఆ గ్రామంలో ఉబికి వస్తున్న నీటి ఊట.. ఎందుకంటే..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details