CRISIL ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని కళ్లకు కట్టేలా దేశంలోని ప్రముఖ రేటింగు సంస్థ క్రిసిల్ తాజాగా తన విశ్లేషణ వెల్లడించింది. అమరావతి బాండ్ల రేటింగును ఈ సంస్థ తగ్గించింది. ఇంతకుముందు ‘ఏ ప్లస్’ ఉన్న రేటింగును ఇప్పుడు ‘ఏ మైనస్’గా మార్చింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అనేక ఆర్థిక అంశాలను విశ్లేషించింది. ఆ విశ్లేషణలోనే ఆర్థిక పరిస్థితులు ఎంత బలహీనంగా ఉన్నాయో విశ్లేషిస్తూ.. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని, బాండ్ల చెల్లింపులకు అనుసరించే విధానానికి ఎదురవుతున్న ప్రతిబంధకాన్ని గమనించి ఈ రేటింగు తగ్గించినట్లు పేర్కొంది. అమరావతి బాండ్లకు వడ్డీలు చెల్లించేందుకు ఏర్పాటుచేసుకున్న విధానం ప్రకారం అవసరమైన నిధులు ఆయా ఖాతాల్లో అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేసింది. ఈ బాండ్లకు గ్యారంటీ ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆర్థిక సమస్యల ఒత్తిడి ఉందని విశ్లేషించింది.
ఆంధ్రప్రదేశ్ అప్పుల భారం రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 2022 మార్చి నెలాఖరు నాటికి 42.1% ఉందని స్పష్టం చేసింది. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక నిర్వహణ వివేకవంతంగా సాగుతోంది. రెవెన్యూ లోటును, ద్రవ్యలోటును ప్రభుత్వం పరిమితం చేసింది. దాంతో రుణ-జీఎస్‌డీపీ నిష్పత్తి తగ్గింది’ అని ఒకవైపు వైకాపా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వారు ఆగస్టు 17న అఫిడవిట్ దాఖలు చేయగా, ఆ మర్నాడే క్రిసిల్ సంస్థ అమరావతి బాండ్ల రేటింగును తగ్గించడం విశేషం. రిజర్వుబ్యాంకు కల్పించిన ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, ఓవర్‌డ్రాఫ్ట్ వెసులుబాటుతోనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ సాగుతోందని క్రిసిల్ స్పష్టంగా పేర్కొంది.
రూ.2,000 కోట్ల బాండ్లు.. చెల్లింపుల విధానానికీ ఇబ్బందులు
అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ బాండ్లు జారీచేసి రూ.2,000 కోట్లు రుణంగా సమీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బాండ్లకు గ్యారంటీ ఇచ్చింది. వీటికి ఎప్పటికప్పుడు వడ్డీలు చెల్లించాలి. ఏపీసీఆర్‌డీఏ రుణాలపై వడ్డీ తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు అందట్లేదు. చెల్లింపులకు ఉన్న విధానం అమలుకు వీలుగా ప్రభుత్వం నిధులు ఇవ్వలేకపోతోంది. బాండ్ల సర్వీసింగ్ అకౌంట్ ద్వారా చెల్లించాలి. రాబోయే రెండు త్రైమాసికాలకు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం ముందే ఆ ఖాతాకు చేర్చాలి. అంతమొత్తం అందులో లేకపోతే ట్రస్టీ డెట్ సర్వీసు రిజర్వు ఖాతా నుంచి తీసుకోవాలి. ఆగస్టు 16న బాండ్ల ఖాతా నుంచి చెల్లింపులకు అవసరమైన విధానం ప్రకారం నిల్వలు లేకపోవడంతో డెట్ సర్వీసింగు రిజర్వు అకౌంట్ నుంచి రూ.26 కోట్లు వినియోగించవలసి వచ్చింది. తదుపరి 2022 నవంబరు 16న, ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 16న చెల్లించాల్సి ఉంటుంది. 2024 ఫిబ్రవరి నుంచి అసలు కింద రూ.200 కోట్ల చెల్లింపులు ప్రారంభమవుతాయి.
ఏపీ ఆర్థిక పరిస్థితులు బలహీనం
* ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సమస్యల వల్ల చెల్లింపులకు ఒత్తిడి పెరుగుతున్న అంశాన్ని క్రిసిల్ పరిగణనలోకి తీసుకుంది.