Illegal Weapons in Telangana: బెదిరింపులు.. దోపిడీలు.. అపహరణలు.. హత్యలు.. ఇవన్నీ చేయాలంటే గన్నులుండాలి. కూర్చొని పరిష్కరించుకోవడం కాదు.. ధనాధన్ ఫటాఫట్‌గా వ్యవహారం తేలిపోవాలని రౌడీషీటర్లు, నేరస్థులు పిస్తోళ్లు.. రివాల్వర్లను వినియోగిస్తున్నారు. రాజకీయ నేతలు, వారి అనుచరులు, వ్యాపారులూ స్థిరాస్తి సెటిల్మెంట్లకు ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. రౌడీషీటర్లు, నేరస్థుల చేతుల్లోనే 80 శాతం వరకూ ఆయుధాలు ఉన్నాయని అంచనా. వీటిని రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. గతంలో కరడుగట్టిన నేరగాళ్ల వద్ద మాత్రమే ఆయుధాలుండేవి. ఇప్పుడు పాతబస్తీలో నేరస్థులు.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో కొందరు రియల్టర్లు, రౌడీషీటర్ల వద్ద అత్యాధునిక పిస్టళ్లు, తుపాకులు, రివాల్వర్లున్నాయి.
అనధికారికంగా 35 వేలు..హైదరాబాద్‌లో పోలీసుల అనుమతితో పది వేల ఆయుధాలుంటే.. అనధికారికంగా 35వేలున్నాయి. గ్రేటర్లో నమోదవుతున్న నేరాల్లో 40శాతం ఆయుధాలకు సంబంధించినవే. రైళ్లల్లో తనిఖీలు లేకపోవడంతో ఆయుధాలు తీసుకువస్తున్నారు. శివారు రైల్వేస్టేషన్లలో దిగి వెళ్లిపోతున్నారు. నగరంలో ప్రస్తుతం తనిఖీలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అక్రమాయుధాలను రాజస్థాన్‌లో జయపుర, బిహార్‌లోని గయ.. ముంగేర్.. పట్నా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, బర్వానీలలో చాలా సులభంగా తయారు చేస్తున్నారు.
ఇస్మాయిల్‌పై 6 కేసులు..రౌడీషీటర్ ఇస్మాయిల్‌పై కాలాపత్తర్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా ఠాణాల పరిధిలో మొత్తం ఆరు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. నవాబ్‌సాబ్‌కుంటలో ఉండే ఇతనికి పదేళ్ల క్రితం ఓ హత్య కేసులో కోర్టు జీవితఖైదు విధించింది. ఐదేళ్లు జైలుశిక్ష అనుభవించాక పైకోర్టులో అప్పీలు చేసుకోగా.. అభియోగాలను కొట్టేసింది. బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడు. మూడేళ్ల క్రితం పీడీ చట్టం ప్రయోగించగా.. రెండేళ్ల క్రితం బెయిల్‌పై వచ్చాడు.
అక్కడే రెండు కాల్పుల ఘటనలు..రౌడీషీటర్‌పై కాల్పులు జరిగిన మాదాపూర్ 100 అడుగుల రోడ్డుకు ఇవతలి వైపు(నీరూస్ జంక్షన్) జూబ్లీహిల్స్ 36లో 2015 అగస్టు 20న మరో కాల్పుల ఘటన జరిగింది. కర్ణాటకకు చెందిన దొంగలు అబ్దుల్ ఖాదర్, మీర్జా అబ్దుల్ ఉల్లాబేగ్ నీరూస్ జంక్షన్ వద్ద చరవాణులు దుకాణంలో దోపిడీకి పథకం వేశారు. పసిగట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేయగా దొంగలు కాల్పులు జరపడంతో ఎల్అండ్టీ కార్మికుడు ధర్మేంద్ర ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అతను ప్రాణాలతో బయటపడ్డాడు.
ఉస్మానియాలో పోస్టుమార్టం..ఇస్మాయిల్ మృతదేహానికి సోమవారం ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మార్చురీ వద్ద ఇస్మాయిల్ స్నేహితుడు ఫయాజ్ మాట్లాడుతూ.. 8 రోజుల క్రితమే తాడ్బంద్ వద్ద ముజాహిదీన్‌తో జరిగిన చర్చలు విఫలమయ్యాయని తెలిపారు. ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దనీ, ఎన్నోసార్లు చెప్పానన్నారు. చర్చించుకుందామని రప్పించి హతమార్చారని పేర్కొన్నారు.