T20 Tickets: హైదరాబాద్ జింఖానా మైదానంలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించిన ఆఫ్‌లైన్ టికెట్ల విక్రయాలు పూర్తయినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వాహకులు వెల్లడించారు. అయితే ఆన్‌లైన్ టికెట్లు ఈరోజు రాత్రి 7 తర్వాత అందుబాటులో ఉంచుతామన్నారు. ఈనెల 25న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ వీక్షించడం కోసం టికెట్ల కొనుగోలుకు అంచనాలకు మించి క్రికెట్ అభిమానులు వచ్చారు. భారీ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొంతమంది అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు.
తొక్కిసలాట: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ వేదికగా ఈ నెల 25న జరగనున్న టీ-ట్వంటీ మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు భారీగా తరలిరావడంతో.. సికింద్రాబాద్ జింఖానా మైదానం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టిక్కెట్ల కోసం నాలుగైదు రోజుల నుంచే భారీగా అభిమానులు తరలివచ్చారు. హెచ్‌సీఏ టిక్కెట్లను బ్లాక్లో అమ్ముతోందంటూ ఆందోళనలు చేపట్టారు. ఓ న్యాయవాది ఏకంగా హెచ్ఆర్సీలో పిటిషన్ వేశాడు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఆఫ్లైన్లో టికెట్లు ఇస్తామని హెచ్‌సీఏ ప్రకటించడంతో.. క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు.