ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిలో కరకట్ట రహదారి విస్తరణ..? - krishna road expansion news

అమరావతిలో కృష్ణా కరకట్ట రహదారిని రెండు వరుసల రోడ్డుగా విస్తరించాలని సీఆర్డీఏ యోచిస్తోంది. రాజధాని పరిధిలో కృష్ణా కరకట్ట సుమారు 14 కిలోమీటర్ల పొడవు ఉంది. దీని విస్తరణకు సీఆర్‌డీఏ గతంలో రూపొందించిన ప్రణాళికను ఆ సంస్థ కమిషనర్‌ మంత్రి బొత్సకు వివరించారు. ప్రస్తుతం 25 మీటర్ల వెడల్పున ఆ రహదారిని విస్తరించాల్సిన అవసరం ఉండదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పనుల పరిమాణం కుదించాలని మంత్రి సూచించినట్టు తెలిసింది.

అమరావతిలో కరకట్ట రహదారి విస్తరణ..?
అమరావతిలో కరకట్ట రహదారి విస్తరణ..?

By

Published : Jun 21, 2020, 8:33 AM IST

రాజధాని అమరావతిలో కృష్ణా కరకట్ట రహదారిని రెండు వరుసల రోడ్డుగా విస్తరించాలని సీఆర్‌డీఏ యోచిస్తోంది. పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ లక్ష్మీనరసింహం శనివారం కరకట్ట రహదారిని పరిశీలించారు. కరకట్ట మీదుగా రాయపూడి వరకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు మీదుగా వచ్చారు. మధ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తూ అసంపూర్తిగా నిలిపివేసిన అపార్ట్‌మెంట్‌ భవనాల వద్ద ఆగి పరిశీలించారు. రాజధాని పరిధిలో కృష్ణా కరకట్ట సుమారు 14 కిలోమీటర్ల పొడవు ఉంది. రాజధానిలో ప్రధాన మౌలిక వసతుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా.. ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రారంభించి 9.2 కి.మీ. దూరం వరకు కరకట్ట రహదారిని 25 మీటర్ల వెడల్పున, నాలుగు వరుసలుగా విస్తరించేందుకు సీఆర్‌డీఏ అప్పట్లో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.395 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు కూడా పిలిచింది. వైకాపా అధికారంలోకి వచ్చాక రాజధానిలో నిర్మాణ పనులన్నీ నిలిపివేయడం వల్ల కరకట్ట రహదారి విస్తరణ మొదలవలేదు. దీని విస్తరణకు సీఆర్‌డీఏ గతంలో రూపొందించిన ప్రణాళికను ఆ సంస్థ కమిషనర్‌ మంత్రి బొత్సకు వివరించారు. ప్రస్తుతం 25 మీటర్ల వెడల్పున ఆ రహదారిని విస్తరించాల్సిన అవసరం ఉండదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పనుల పరిమాణం కుదించాలని మంత్రి సూచించినట్టు తెలిసింది. రాజధానిలో ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాల్ని బొత్స సోమవారం కూడా పరిశీలించనున్నట్టు తెలిసింది. రాజధానిలో నిలిచిపోయిన కొన్ని పనుల్ని మళ్లీ ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. అవి ఏ స్థాయిలో చేయాలి, ఎంత వరకు కుదించాలి? నిధులు ఎక్కడి నుంచి సమీకరించాలి? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉందని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును అభివృద్ధి చేయరా?

రాజధానిలో తొలి దశలో 18 కిలోమీటర్ల మేర ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు) నిర్మాణం చేపట్టారు. ఆరువరుసల ఈ రోడ్డు దాదాపు 14 కిలోమీటర్లు పూర్తైంది. భూసేకరణ సమస్యల వల్ల మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు సహా రాజధానికి వెళ్లే వారంతా ప్రధానంగా ఈ రహదారి మీదే రాకపోకలు సాగిస్తున్నారు. సీఆర్‌డీఏ ప్రణాళిక ప్రకారం... ఈ రహదారిని మొదట ప్రకాశం బ్యారేజీ వరకు నిర్మించాలి. రెండో దశలో మణిపాల్‌ ఆస్పత్రి వద్ద జాతీయ రహదారికి అనుసంధానించాలి. కానీ తొలిదశలో మిగిలిపోయిన 4 కిలోమీటర్ల పనుల్ని పూర్తిచేసే యోచనే ప్రభుత్వానికి లేనట్టు సమాచారం. భూసేకరణ సమస్యలు ఉండటం, ప్రకాశం బ్యారేజీ వద్ద సాగునీటి కాలువలు ఉండటం దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. దానికి ప్రత్యామ్నాయంగానే కరకట్ట మార్గాన్ని విస్తరించే యోచనలో ఉన్నట్టు తెలిపారు.

రహదారులు అభివృద్ధి చేస్తాం

మంత్రి బొత్స శనివారం రాయపూడిలో వైకాపా నాయకుడు హరీంద్రనాథ్‌ చౌదరి తదితరులతో కాసేపు ముచ్చటించారు. రాజధానిలో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్టు వారితో బొత్స చెప్పినట్టు తెలిసింది.

ఇదీ చూడండి..

అఖిలపక్ష సమావేశంపై వివాదం సరికాదు: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details