ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆ 2 చట్టాలు పరస్పర విరుద్ధం

By

Published : Nov 27, 2020, 10:54 AM IST

ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా రాజధాని అమరావతి ఏర్పాటు జరిగిందని.. ఇప్పుడు మార్చాలంటే ఆ చట్టానికి సవరణ చేయడం తప్ప మరోమార్గం లేదని హైకోర్టులో న్యాయవాది అంబటి సుధాకర్‌రావు వాదించారు. మూడు రాజధానుల విషయంలో చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్​డీఏ చట్టాలు పరస్పర విరుద్ధమని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

crada, Decentralization of governance cases trails in high court
crada, Decentralization of governance cases trails in high court

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు వ్యవహారాలపై అమరావతి రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో రోజువారీ విచారణ కొనసాగుతోంది. రైతుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది అంబటి సుధాకరరావు.. రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగా అమరావతి ఏర్పాటు చేశారని, ఇప్పుడు రాజధాని మార్చాలంటే ఆ చట్టానికి సవరణ చేయడం తప్ప వేరే మార్గం లేదని వాదించారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయన్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌ అమలు చేయాలంటే శాసన, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థలు ఇప్పుడున్నచోటే ఉండాలన్నారు. అమరావతిలో చట్టబద్ధంగా ఏర్పాటు చేయాల్సిన నిర్మాణాల్ని వేరే ప్రాంతాలకు తరలిస్తే సీఆర్డీఏ చట్టం ద్వారా దఖలు పడిన రైతుల హక్కుల్ని ప్రభుత్వం ఎలా రక్షిస్తుందని కోర్టు దృష్టికి తెచ్చారు.

అమరావతిలో హైకోర్టు ఏర్పాటును రాష్ట్రపతి నోటిఫై చేశారని, విభజన చట్టం అమల్లో ఉన్నంతదాకా హైకోర్ట్‌ను మారుస్తూ మళ్లీ శాసనం చేసే అధికారం రాష్ట్రానికి లేదని సుధాకరరావు తేల్చి చెప్పారు . విభజన చట్టంలో ఏపీ కోసం ఒక కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని స్పష్టంగా ఉందని, బహుళ రాజధానుల ప్రస్తావనే లేదన్నారు .

ఈ సమయంలో స్పందించిన ధర్మాసనం రాజధానిని నిర్ణయించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ' అధికారం' ఎక్కడుందో విభజన , సీఆర్డీఏ చట్టాల్లో పేర్కొలేదని తెలిపింది. దీనిపై స్పందించిన రైతుల తరఫున్యాయవాది సుధాకరరావు.. సీఆర్డీఏ చట్టం ఉద్దేశం ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటు గురించేనని వివరించారు . అమరావతిలో రాజధానిని నిర్ణయిస్తూ అప్పటి శాసనసభ .. తీర్మానం చేశారని, రాజధాని నగర ప్రాంతాన్ని గుర్తిస్తూ గెజిట్ కూడా జారీ చేశారన్నారు. దీనిపై మరోసారి స్పందించిన ధర్మాసనం రాజధాని ఏర్పాటును అసెంబ్లీ నిర్ణయిస్తే దాన్ని మార్చే అధికారం కూడా ఉన్నట్లే కదా? అని ప్రశ్నించింది . దీనికి న్యాయవాది బదులిస్తూ విభజన చట్ట ప్రకారం రాజధాని స్థాపన కోసం, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన అధికారాన్ని ఓ సారి వినియోగించాక మరోసారి వాడలేరన్నారు . అసెంబ్లీ ఎక్కడనిర్వహించాలనేది పూర్తిగా గవర్నర్ పరిధిలోనిదని ఈ నేపథ్యంలో ' శాసన రాజధాని ' అనే దానికి నిర్వచనం లేదన్నారు.

పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల ఆమోదం సందర్భంగా అసెంబ్లీ రికార్డులు కోర్టుకు సమర్పించాలని.. ధర్మాసనం మరోమారు స్పష్టం చేసింది. తాజా విచారణలో కొందరు పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించేందుకు ప్రత్యక్షంగా హాజరుకాకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది . వరుస సంఖ్యలో కేసుల్ని పిలిచి కొన్ని వ్యాజ్యాల్ని జాబితా నుంచి తొలగించింది .

ఇదీ చదవండి: ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు... నోటిఫికేషన్ విడుదల...

ABOUT THE AUTHOR

...view details