రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలంటూ రైతులు, మహిళలు 823వ రోజు నిరసనలు కొనసాగించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ -బిల్డ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రాజధాని అమరావతిలో వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. తుళ్లూరులో రైతుల దీక్షకు మద్దుతు తెలిపిన సీపీఎం నేతలు.. ప్రజా పాదయాత్ర నిర్వహించారు. మోతడక గ్రామ రైతులు.. తుళ్లూరు అనంతవరం వేంకటేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్ర చేపట్టారు. రాజధాని ఐకాస నేతలు, రైతులు పాదయాత్రలో పాల్గొన్నారు. గ్రంథాలయ కూడలిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిలో ఆగిన నిర్మాణాలను వెంటనే చేపట్టాలని నినదించారు.
రాజధాని విషయంలో ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వికేంద్రీకరణ అంటే రాజధానిని విడదీయడం కాదని.. అభివృద్ధి నలుదిశలు వ్యాపించాలన్నారు. మూడు రాజధానులపై బిల్లు పెడితే రైతుల ఆగ్రహం చూస్తారని హెచ్చరించారు.