ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CPM: 'అమరావతి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం'

అమరావతి పరిరక్షణ సమితి - ఐకాస చేపట్టిన మహా పాదయాత్రపై అన్నివర్గాల మద్దతు కూడగట్టేందుకు బుధవారం గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. అయితే నేటి నుంచి సీపీఎం ఆధ్వర్యంలో రాజధాని అమరావతి రైతులకు అండగా దశల వారీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు బాబురావు అన్నారు.

సీపీఎం నేత బాబురావు
సీపీఎం నేత బాబురావు

By

Published : Oct 26, 2021, 7:13 PM IST

అమరావతి పరిరక్షణ సమితి - ఐకాస చేపట్టిన మహా పాదయాత్రపై అన్నివర్గాల మద్దతు కూడగట్టేందుకు బుధవారం గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. అరండల్​పేటలోని వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో జరిగే సమావేశంలో ఐకాస నేతలు, రాజధాని రైతు నాయకులు, వివిధ రాజకీయ పక్షాల వారు పాల్గొంటారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న సుధీర్ఘ పోరటానికి ప్రభుత్వం నుంచి స్పందన లేని తరుణంలో రాష్ట్ర ప్రజల మద్దతు కోసం మహాపాదయాత్రకు రూపకల్పన చేశారు.

తుళ్లూరు నుంచి తిరుమల వరకూ జరిగే ఈ పాదయాత్ర నవంబర్ 1న ప్రారంభమై డిసెంబర్ 15వ తేదీ వరకూ జరగనుంది. ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలకు అమరావతి ఆవశ్యకతను వివరిస్తామంటున్నారు ఐకాస నేతలు. న్యాయపోరాటం తుది దశకు చేరుకున్న తరుణంలో, రైతుల ఆకాంక్షల్ని ప్రజలందరికి తెలియచేయాలనే ఉద్దేశ్యంతో "న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు" అన్న పేరుతో 45 రోజుల పాదయాత్రకు సంకల్పించినట్లు వారు చెబుతున్నారు.

దశల వారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం: సీపీఎం

నేటి నుంచి సీపీఎం ఆధ్వర్యంలో రాజధాని అమరావతి రైతులకు అండగా దశల వారీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు బాబురావు అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... నవంబర్ 6వ తేదీన తుళ్లూరులో మహాధర్నా కార్యక్రమాన్ని చేపడతామన్నారు. వైకాపా ప్రభుత్వం రాజధాని విషయంలో మాటతప్పిందన్నారు.

రాజధానిని ముక్కలు చేస్తూ ప్రజల జీవితాలను చిందరవందర చేస్తుందని..... రాజధానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా భాజపా నేతలు పూటకొక మాట మాట్లాడుతూ ప్రజలను మభ్యపరుస్తున్నారని తెలిపారు. సీపీఎం మొదటి నుంచి రాజధాని అమరావతిలోనే కొనసాగాలని కోరుతోందన్నారు.పూలింగ్ చట్టంలో ఇచ్చిన హామీలను గత ప్రభుత్వం కంటే మెరుగ్గా అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

ఇదీ చదవండి:చెల్లింపును అన్నదాతలకు ఇచ్చే సాయంగా చెప్పుకోవడం సిగ్గుచేటు: మర్రెడ్డి

ABOUT THE AUTHOR

...view details