CPM protest in srikakulam: రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని పాలకొండలోని సీపీఎం మండల కమిటీ కన్వీనర్ దావాల రమణారావు డిమాండ్ చేశారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించవలసి ఉన్నప్పటికీ, నేటికీ సగం ధాన్యం సైతం కొనుగోలు చేయలేదని అన్నారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.615.87 కోట్లు నెల రోజులు దాటినా చెల్లించడం లేదని మండిపడ్డారు.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం వలన ప్రైవేటు వ్యాపారులు బస్తాకు రూ.200 వరకు ధరను తగ్గిస్తున్నారని తెలిపారు. 5 నుంచి 10 కేజీలు అదనంగా ధాన్యాన్ని తూకం వేసి రైతుల నుంచి దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రాప్ బుకింగ్ లేదని కౌలు రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్నారని అన్నారు. అడంగల్ రావడం లేదని రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలుకు నిరాకరిస్తున్నారని తెలిపారు.