పాలనా వికేంద్రీకరణ , సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయంపై కౌంటర్ దాఖలు చేసేందుకు వివిధ రాజకీయ పార్టీలకు వెసులుబాటు ఇచ్చింది. దీనికి స్పందిస్తూ.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హైకోర్టులో అఫిడవిట్ వేశారు. కేంద్రం మద్దతుతోనే గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించిందని.. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని గౌరవించాల్సిందేనని సీపీం అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రజల ఏకాభిప్రాయాన్ని ప్రభుత్వం విస్మరించడానికి వీల్లేదంది. రాజధానికి వ్యవసాయ భూములు ఇచ్చిన వేలాది రైతుల త్యాగాన్ని పణంగా పెట్టి వికేంద్రీకరణ జరపకూడదని పేర్కొంది. మెరుగైన జీవనం కోసం, భవిష్యత్తు తరాలకు అవకాశాలొచ్చేలా అమరావతి అభివృద్ధి చెందుతుందని రైతులు భూములు ఇచ్చారని అభిప్రాయపడింది.
రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కోరుకుంటున్నట్టు సీపీఎం ఉద్ఘాటించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, వ్యవసాయం, పారిశ్రామికీకరణ, విద్య, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ఐటీ సంస్థల ఏర్పాటుతో రాష్ట్రం మొత్తం అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించింది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ స్థాపనలు జరగాలంది. ప్రస్తుత ప్రభుత్వం పక్షపాతంతో ప్రాంతాలవారీగా ప్రజల మధ్య అగ్గి రాజేయడం అనవసరమని.. ఈ తరహా విభేదాలు తీసుకురావటం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆరోగ్యకరం కాదని అభిప్రాయపడింది. 2016 నుంచి అమరావతిలో ప్రభుత్వ కార్యకలాపాలు సాగుతున్నాయని.. ఈ నేపథ్యంలో రాజధానిని తరలించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు..సీపీఎం తన అఫిడవిట్‌లో పేర్కొంది. అధికారిక భవనాల నిర్మాణాల్ని నిలిపేయడం, రాజధానిని మూడు ముక్కలు చేస్తాననడం, ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రి పరిగణనలోకి తీసుకోకపోవడంతో చాలా పరిశ్రమలు హైదరాబాద్‌కు తరలిపోవటానికి కారణాలుగా పేర్కొంది. నాడు ప్రతిపక్షనేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి.. రాజధాని విషయంలో బేషరతుగా మద్దతు తెలిపారని గుర్తు చేసింది.