పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా మద్యం ధరలు తగ్గిస్తే.. ఎవరికి ప్రయోజనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంతో పోలిస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రంలో లీటరుకు రూ.10లు అధికంగా ఉన్నాయన్నారు. సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ జీవో ఇచ్చిన సీఎం.. మద్యపాన నిషేధం అమలును మాత్రం తుంగలో తొక్కారని మండిపడ్డారు.
ప్రజల జీవన స్థితిగతులతో ముడిపడి ఉన్న.. పెట్రో ధరలు తగ్గించకుండా మద్యం ధరలను తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలను కనీసం తమిళనాడుతో సమానంగా తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.