రాజధాని అమరావతి విషయంలో భాజపా అధిష్ఠానం డబుల్ డ్రామా ఆడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. పార్టీపరంగా ఓ వైఖరి, ప్రభుత్వపరంగా మరో వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిపై కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని రైతుల నిరసనలు 700 రోజులకు చేరుకున్న సందర్భంగా గుంటూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
రాజధాని అమరావతి రైతులది చరిత్రాత్మక పోరాటమన్న రామకృష్ణ.. నిరసనలు చేపట్టి 700 రోజులైనా ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. రైతులపై జగన్ మోహన్ రెడ్డికి ఎంత ద్వేషముందో దీన్నిబట్టే అర్థమవుతోందన్నారు. జగన్ ప్రమాదకరమైన రాజకీయ క్రీడ ఆడుతున్నారని.., మూడు ప్రాంతాల్లో పోటీ ధర్నాలతో వైషమ్యాలు రెచ్చగొడుతున్నారన్నారు. చివరకు న్యాయమూర్తుల వ్యవహారాల్లోనూ జగన్ జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. అమరావతిని కాపాడుకునే వరకు రాజధాని రైతులకు సీపీఐ అండగా ఉంటుందని రామకృష్ణ స్పష్టం చేశారు.