వివాదాస్పద అంశాలను పక్కన పెట్టి కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతూ సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసులు లక్షా 86 వేలు దాటాయని.. గత 10 రోజుల నుంచి రోజుకు 8 నుంచి 10 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.
రాజధాని మార్పు బిల్లుపై హైకోర్టు స్టేటస్ కో స్టే విధించినందున ఇప్పటికైనా ఆ అంశాన్ని పక్కన పెట్టాలని కోరారు. ప్రభుత్వం రోజుకు ఒక్కొక్కరికి 500 రూపాయలు ఆహారం కోసం ఖర్చు పెడుతూ, నెలకు రూ.350 కోట్లు వెచ్చిస్తున్నామని చెబుతున్నప్పటికీ. ఆచరణలో మాత్రం కరోనా రోగులకు సరైన వైద్యం, ఆహారం అందడం లేదన్నారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల చేతివాటం కరోనా రోగుల పాలిట శాపంగా పరిణమించిందని విమర్శించారు.