పోలవరం సందర్శనకు వెళ్లిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు నేతలను అరెస్టు చేయడాన్ని.. ఆ పార్టీ నేతలు ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఎందుకు అక్కడికి వెళ్లకూడదో తెలపాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే.. ఇలా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలో...
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన సీపీఐ నాయకులను తక్షణమే విడుదల చేయాలంటూ.. ఆ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. విజయవాడలోని దాసరి భవన్ వద్ద ధర్నాకు దిగారు. పోలవరం ప్రాజెక్టుపై వస్తున్న వార్తల్లో వాస్తవాలను తెలుసుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని.. సీపీఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ పేర్కొన్నారు.
కడపలో...
పోలవరం సందర్శనకు వెళ్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు 18 మందిని అరెస్టు చేయడం దారుణమని ఆ పార్టీ కడప కార్యదర్శి వెంకట శివ మండిపడ్డారు. తమ నాయకుల నిర్బంధాన్ని నిరసిస్తూ.. కడప శివారులోని అలంఖంపల్లి వద్ద ధర్నా చేపట్టారు. ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన రామకృష్ణను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అనంతపురంలో...
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అరెస్టును ఖండిస్తూ.. అనంతపురంలో ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించడం వల్ల ప్రభుత్వానికి కలిగిన నష్టం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా నేతలు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. సీఎం జగన్‌ను గద్దె దింపుతామని హెచ్చరించారు. తమ నాయకుడు రామకృష్ణను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గుంతకల్లులో...
సీపీఐ నాయకుల అక్రమ అరెస్ట్‌కు నిరసనగా.. అనంతపురం జిల్లా గుంతకల్లులోని పొట్టి శ్రీరాములు కూడలి వద్ద ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పోలవరం విషయంలో కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని.. జగన్ సర్కారు వ్యతిరేకించడం లేదని మండిపడ్డారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందేమో అన్న అనుమానం కలుగుతోందన్నారు. దానిని పరీశీలించడానికి ప్రభుత్వ అనుమతితో వెళ్లాలనుకున్న తమ నాయకులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ నేతలు ఇదీ చదవండి:'పోలవరాన్ని ఉద్ధరించామంటున్నారుగా.. మరి ఈ నిర్బంధాలు ఎందుకు?'