మూడు రాజధానులకు సీపీఐ వ్యతిరేకమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాజా స్పష్టం చేశారు. దిల్లీలో ఆయన్ను అమరావతి పరిక్షణ సమితి నేతలు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాజధానిగా అమరావతే ఉండాలన్నది సీపీఐ నిశ్చితాభిప్రాయమని తెలిపారు. ఆందోళనను అణచివేసేందుకు ప్రభుత్వం హింసకు పాల్పడుతోందని విమర్శించారు. నిరసనకారులు, మహిళలపై దాడులను ఖండించారు. రాజధానిపై ఆందోళనతో చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు.
వికేంద్రీకరణ అంటే మూడు రాజధానుల నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. పెద్ద రాష్ట్రాల్లోనూ ఈ తరహా నిర్ణయాలు లేవని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధానాలు ఇక్కడెందుకని ఆక్షేపించారు. పునర్విభజన చట్టాన్ని కేంద్రం ఎందుకు అమలు చేయటంలేదనే విషయాన్ని ప్రభుత్వం నిలదీయాలని సూచించారు. ప్రజలతో పోరాడడం కంటే కేంద్రంతో పోరాడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని హితవు పలికారు.