CPI Narayan Wife Pass away: సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సతీమణి వసుమతిదేవి(67) అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తిరుమలలోని అపోలో అత్యవసర చికిత్సా కేంద్రంలో చేరిన ఆమెను అనంతరం తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు చేసి గుండెలో స్టెంట్ అమర్చారు. గురువారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆమె నగరంలోని తన సమీప బంధువు ఇంటికి వెళ్లారు. అక్కడ సాయంత్రం వేళ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలిసిన వెంటనే నారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాన్ని తిరుపతి నుంచి ఐనంబాకం గ్రామానికి తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం 12 గంటల వరకు మృతదేహాన్ని అక్కడ ఉంచుతారు. అనంతరం తిరుపతిలోని సీపీఐ కార్యాలయానికి ప్రజల సందర్శనార్థం తీసుకొస్తారు. ఆ తర్వాత మెడికల్ కళాశాలకు అప్పగిస్తారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు నారాయణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర:వసుమతిదేవి 1976లో ఎమ్మెస్సీ చదివే రోజుల్లో ఏఐఎస్‌ఎఫ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలో విద్యార్థి, యువజన విభాగాలకు నాయకత్వం వహిస్తున్న కె.నారాయణతో వసుమతిదేవికి పరిచయమై వివాహానికి దారి తీసింది. వివాహం తరువాత కమ్యూనిస్టు ఉద్యమాల్లోనూ పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగిగా చేరిన ఆమె కొన్నేళ్ల క్రితం మేనేజర్ స్థాయిలో పదవీ విరమణ చేశారు.