ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AMARAVATI FARMERS PADAYATRA: 'రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి.. అది అమరావతే' - అమరావతి రైతులను కలిసిన సీపీఐ నేతలు

AMARAVATI FARMERS PADAYATRA: 5 కోట్ల ఆంధ్రుల అభివృద్ధికి వారధైన అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ అన్నదాతలు చేస్తున్న పాదయాత్ర నేడు శ్రీకాళహస్తి నుంచి అంజిమేడు వరకు సాగనుంది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా రైతుల్ని కలిసి అమరావతికి మద్దతు తెలిపారు. మరోవైపు తిరుపతి బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించటంతో హైకోర్టును అశ్రయించనున్నట్లు ఐకాస నేతలు తెలిపారు.

AMARAVATI FARMERS PADAYATRA
అమరావతి రైతుల పాదయాత్ర

By

Published : Dec 11, 2021, 7:23 AM IST

AMARAVATI FARMERS PADAYATRA: శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న రాజధాని రైతులు.. రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. 41వ రోజు పాదయాత్ర శ్రీకాళహస్తి నుంచి ప్రారంభించనున్నారు. రాయలసీమ ప్రజల నుంచి లభిస్తున్న అపూర్వ మద్దతుతో దాదాపు 17 కిలోమీటర్ల నడక సాగించనున్నారు. శ్రీకాళహస్తి నుంచి మిట్టకండ్రిగ, చెర్లోపల్లే, ఇసుకగుంట, రాచగన్నెరు మేర్లపాక, ఏర్పేడు, సీతారాంపేట మీదుగా అంజిమేడు వరకు యాత్ర కొనసాగనుంది.

అమరావతి రైతులకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. 3రాజధానులతో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ పక్క రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నై. హైకోర్టు చెన్నైలోనే ఉంది. హైకోర్టు బెంచ్ మాత్రం మధురైలో ఉంది. కేరళ రాజధాని తిరువనంతపురం. హైకోర్టు కొచ్చిన్‌లో ఉంది. అక్కడ అంతా సవ్యంగా నడుస్తున్నాయి. సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని ఎందుకు తీసుకువచ్చారు..? రాష్ట్రానికి ఒకే ఒక్క రాజధాని ఉండాలి. అది అమరావతే. - డి. రాజా, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి

సభకు అనుమతి నిరాకరణ..

తిరుపతిలో రాజధాని రైతులు ఈనెల 17న తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మెుదట ఎస్వీ యూనివర్శిటి మైదానంలో సభకు అధికారుల్ని సంప్రదించగా అనుమతివ్వలేదు. ఓ ప్రైవేటు స్థలంలో సభకు అనుమతివ్వాలని పోలీసుల్ని ఐకాస నేతలు కోరారు. తిరుపతి అర్బన్ పోలీసులు సభకు అనుమతి నిరాకరిస్తున్నట్లు శుక్రవారం లేఖ పంపారు. పాదయాత్రలో 42 రకాల ఉల్లంఘనలు జరిగాయని, కొన్ని సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు పోలీసులు ప్రస్తావించారు. అయితే హైకోర్టును అశ్రయించి.. సభకు అనుమతి సాధిస్తామని రైతుల తరపు న్యాయవాది తెలిపారు. ఇలాంటి ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అమరావతిని ఏకైక రాజధానిగా కాపాడుకుంటామని రైతులు తేల్చిచెప్పారు.

అమరావతి రైతుల పాదయాత్ర

ఇవీ చూడండి:

తిరుపతిలో అమరావతి రైతుల సభకు అనుమతి నిరాకరణ

AMARAVATI FARMERS PADAYATRA IN CHITTOOR : తుదిఘట్టానికి చేరిన పాదయాత్ర...చిత్తూరు జిల్లాలో ప్రవేశం

ABOUT THE AUTHOR

...view details