కొవిడ్ టీకాను ప్రజలకు అందించే క్రమంలో తొలుత సన్నద్ధత పరీక్ష (డ్రై రన్) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఇందులో దక్షిణాది నుంచి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఎంపికైంది. మిగిలిన రెండింటిలో ఒకటి హరియాణా కాగా.. మూడో రాష్ట్రంగా ఉత్తర్‌ప్రదేశ్ లేక గుజరాత్‌ని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. సమగ్ర సార్వత్రిక టీకాల అమలు కార్యక్రమం ‘మిషన్ ఇంద్రధనుష్’ అమలులో మూడేళ్ల క్రితం దేశంలో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. మీజిల్స్-రుబెల్లా(ఎంఆర్) టీకా, పోలియో ఇంజక్షన్.. తదితరాలనూ సమర్థంగా అమలు చేసింది. ఈ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకొని కొవిడ్ టీకా అమలులో ముందస్తు సన్నద్ధత పరీక్ష నిర్వహణకు తెలంగాణను ఎంపిక చేసినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
అమలులో సమస్యల్ని గుర్తించడానికే
టీకా ఇచ్చేటప్పుడు ఎటువంటి విధానాలను అవలంబిస్తారో.. వాటన్నింటినీ డ్రై రన్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. కొవిడ్ టీకాలు రాష్ట్రానికి చేరినప్పటి నుంచి అత్యంత శీతల కేంద్రంలో నిల్వ ఉంచడం.. అక్కడినుంచి జిల్లా స్థాయిలో నిల్వ కేంద్రానికి తరలించడం.. ఆ తర్వాత ఆసుపత్రిలో టీకా ఇవ్వడం.. ఈ క్రమంలో పాటించే జాగ్రత్తలు, అనుసరించే విధివిధానాలను అణువణువునా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. అతి సూక్ష్మలోపాలనూ క్షుణ్నంగా గుర్తించి నమోదు చేస్తారు. తద్వారా ఏ దశలో ఎటువంటి క్రమబద్ధీకరణ అవసరమో గుర్తించి చక్కదిద్దుతారు.