తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ రెండోదశ కలకలం రేపుతోంది. గతేడాది ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్టు నెలల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈసారీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందా? అనే ఆందోళన వైద్యారోగ్య శాఖలో వ్యక్తమవుతోంది. తగిన జాగ్రత్తలు పాటించకపోతే... వచ్చే రెండు నెలల్లో... ఇప్పుడు వస్తున్న కేసుల కంటే రెట్టింపు నమోదయ్యే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అంచనాలు తారుమారు..
రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ విజృంభించిన కొవిడ్.... ఆ తర్వాత నెమ్మదిస్తూ వచ్చింది. సెప్టెంబరు 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకూ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో కేసులు విజృంభిస్తున్నా రాష్ట్రంలో కేసులు పెరగకపోవడం ఊరటనిచ్చింది. రాష్ట్రంలో రెండోదశ ఉద్ధృతి రాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆ అంచనాలను తారుమారు చేస్తూ... మార్చి నుంచి క్రమేణా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
క్రమేణా పెరుగుతున్న కేసులు..
మార్చి 1న 163 కేసులు నమోదవగా... 30 రోజుల్లో నాలుగు రెట్లకు పైగా పెరిగింది. మార్చి 30 న 684 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసులు 3,07,889కి చేరాయి. గతంలోలా జీహెచ్ఎంసీలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. గత 4 వారాల్లో 64 మంది చనిపోయారు. చికిత్స పొందుతున్నవారి సంఖ్య మార్చి 1న 19 వందల 7 ఉండగా... మార్చి 30 నాటికి బాధితుల సంఖ్య 4,965కు పెరిగింది. గత 30 రోజుల్లో వైరస్ క్రమేణా పెరుగుతున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.