రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. వారం రోజుల్లోనే పాజిటివిటీ రేటు 11 శాతంపైగా వృద్ధి చెందింది. ఈనెల పదో తేదీన 4.05% ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 15.22 శాతానికి చేరింది. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 30,022 మందికి పరీక్షలు చేయగా.. 4,570 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 1,124, విశాఖపట్నంలో 1,028, గుంటూరులో 368, అనంతపురం జిల్లాలో 347 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో చిత్తూరు జిల్లాలో ఒకరు మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం 26,770 మంది కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 6,080 మంది, విశాఖపట్నం జిల్లాలో 5,619 మంది ఉన్నారు. గత ఇరవై నాలుగు గంటల్లో 660 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
ఐదు వేలకు చేరువ...
శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల మధ్య 35,673 మందికి పరీక్షలు చేయగా 4,955 మందికి కొవిడ్‌గా నిర్ధారించారు. అంటే పాజిటివిటీ రేటు 13.89 శాతంగా ఉంది. ఒమిక్రాన్ ప్రభావం మొదలయ్యాక... కేసుల సంఖ్య 5వేలకు చేరువకావడం గమనార్హం. అత్యధికంగా విశాఖపట్నంలో 1,103, చిత్తూరు జిల్లాలో 1,039 మందికి కొవిడ్ సోకింది. అధిక శాతం జిల్లాల్లో కేసుల సంఖ్య 300 పైనే ఉంది. వైరస్‌తో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. 24 గంటల్లో కొవిడ్ నుంచి 397 మంది కోలుకున్నారు. 22,870 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కరోనా
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు కరోనా బారినపడ్డారు. శనివారం జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు.